ఎస్ఐఆర్ గడువు మరో నెల పొడిగించాలి
గడువు పెంపును స్వాగతించిన మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి..
ఓటర్లకు ఉచిత న్యాయసహాయం కోసం రాష్ట్రస్థాయి లీగల్ కమిటీ ఏర్పాటు
విజయవాడ, (ఆంధ్రప్రభ): ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించడాన్ని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి స్వాగతించింది. అయితే ఏ అర్హుడైన ఓటరూ ఓటు హక్కు కోల్పోకుండా ఉండేందుకు గడువును మరో నెల రోజుల పాటు పొడిగించాలని భారత ఎన్నికల సంఘాన్ని కోరింది. విజయవాడలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సమితి అధ్యక్షుడు ఫారూఖ్ షుబ్లీ మాట్లాడుతూ, సాధారణ ప్రజలు, నిరక్షరాస్యులు, మైనార్టీలకు తగిన సమయం కల్పించాలనే ఉద్దేశంతో గడువు పెంపు కోరామని తెలిపారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల అనంతరం తలెత్తే అభ్యంతరాలు, సవరణల కోసం హైకోర్టు న్యాయవాది అబ్దుల్ సలీం నేతృత్వంలో 20 మంది సీనియర్ న్యాయవాదులతో రాష్ట్రస్థాయి లీగల్ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కమిటీ బాధితులకు ఉచిత న్యాయసహాయం అందిస్తుందని చెప్పారు. మాజీ సీనియర్ సివిల్ జడ్జి షేక్ ఇంతియాజ్ మాట్లాడుతూ, డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరిశీలించాలని, రాష్ట్రవ్యాప్తంగా 65 నియోజకవర్గాల్లో ప్రత్యేక డెస్కుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అర్హులైన ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
