మెదక్‌లో కల్తీ పాల దందా గుట్టురట్టు..

భారీగా రసాయనాలు, పౌడర్ స్వాధీనం

మెదక్ (ఆంధ్రప్రభ): ప్రమాదకర రసాయనాలతో కల్తీ పాలు తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఓ ముఠా గుట్టును బుధవారం పోలీసులు రట్టు చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలోని ఓ పాలకేంద్రంపై మెరుపు దాడులు నిర్వహించిన పోలీసులు కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు అనుమానిస్తున్న ఓ వ్యాపారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తనిఖీల్లో లిక్విడ్ రసాయనాలు, పౌడర్‌తో పాటు పెద్ద మొత్తంలో అనుమానాస్పద పాలను స్వాధీనం చేసుకున్నారు.

పరిసర గ్రామాల రైతుల నుంచి పెద్దఎత్తున పాలను సేకరించి, వాటిలో ప్రమాదకర రసాయనాలు కలిపి రోజూ వందల లీటర్ల కల్తీ పాలను తయారు చేసి హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణాలు, స్వీట్ హౌస్‌లకు తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే స్వాధీనం చేసుకున్న పాలు, రసాయనాల నమూనాలను వెటర్నరీ వైద్యులు పరీక్షించిన తర్వాతే అవి కల్తీవో కాదో నిర్ధారణ అవుతుందని నర్సాపూర్ ఎస్‌ఐ రంజిత్ రెడ్డి తెలిపారు.