ఎల్‌నినో ప్రభావం: తగ్గే వర్షాలు.. పెరుగుతున్న ప్రమాదం
ఎల్‌నినో ప్రభావం: తగ్గే వర్షాలు.. పెరుగుతున్న ప్రమాదం
- వ్యవసాయం, ఆహార భద్రతపై వాతావరణ మార్పుల ప్రభావం
- రైతులకు అవసరమైన శాస్త్రీయ వ్యవసాయ మార్పులు
- పంటల బీమా, నిల్వ వ్యవస్థల బలోపేతమే పరిష్కారం
- సమష్టి కృషితోనే ఆహార సంక్షోభాన్ని నివారించగలం
వాతావరణ మార్పులు ఇప్పుడు భవిష్యత్ ప్రమాదం కాదు.. వర్తమాన వాస్తవం. ఒకప్పుడు ఋతువులు సమయానికి వచ్చేవి. వర్షాలు ఒక క్రమంలో కురిసేవి. రైతులు వాటిని ఆధారంగా చేసుకుని సాగు ప్రణాళికలు రూపొందించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎండలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. వర్షాలు ఆలస్యంగా వస్తున్నాయి. వచ్చినా ఒకేసారి కుండపోతగా కురిసి వరదలు సృష్టిస్తున్నాయి. తర్వాత మళ్లీ దీర్ఘకాలం పొడి వాతావరణం నెలకొంటోంది. ఈ అసాధారణ పరిస్థితులకు ప్రధాన కారణాల్లో ఒకటి ఎల్‌నినో ప్రభావం.
భారత వాతావరణ శాఖ, భారత ఉష్ణమండల వాతావరణ అధ్యయన సంస్థతో పాటు అంతర్జాతీయ వాతావరణ సంస్థలు కూడా ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాన్ని హెచ్చరిస్తున్నాయి. ఈ ప్రభావం సెప్టెంబరు వరకు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల రుతుపవనాల బలం తగ్గి, దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉంది. భారత వాతావరణ శాఖ కూడా ఈ ఏడాది రుతుపవన వర్షపాతం దీర్ఘకాలిక సగటులో సుమారు 90 శాతమే ఉండవచ్చని పేర్కొంది. అంటే వ్యవసాయం, తాగునీరు, విద్యుత్, ఆహార ఉత్పత్తి వంటి రంగాలపై ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశం ఉంది.
ఎల్‌నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం. ఈ మార్పు ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ, వర్షపాత విధానాలను ప్రభావితం చేస్తుంది. భారతదేశంలో సాధారణంగా ఇది నైరుతి రుతుపవనాలను బలహీనపరుస్తుంది. ఫలితంగా వర్షాలు ఆలస్యంగా రావడం, తక్కువగా కురవడం లేదా అసమానంగా కురవడం జరుగుతుంది. ఈ పరిస్థితులు ముఖ్యంగా వర్షాధార వ్యవసాయంపై ఆధారపడే రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.
భారతదేశంలో దాదాపు 60 శాతం వ్యవసాయం ఇప్పటికీ వర్షాలపైనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, పత్తి వంటి పంటలు ఎక్కువగా వర్షాధార ప్రాంతాల్లోనే సాగవుతాయి. వర్షాలు తగ్గితే దిగుబడులు పడిపోతాయి. రైతుల ఆదాయం తగ్గుతుంది. అప్పులు పెరుగుతాయి. చివరకు దేశ ఆహార భద్రత కూడా ప్రమాదంలో పడుతుంది. అందుకే వాతావరణ మార్పు అనేది కేవలం ప్రకృతి సమస్య కాదు.. అది ఆర్థిక, సామాజిక, ఆహార భద్రతకు సంబంధించిన పెద్ద సవాలు.
ఇటీవలి సంవత్సరాల్లో భారతదేశం తీవ్ర వాతావరణ వైపరీత్యాలను వరుసగా చూస్తోంది. ఒకవైపు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మరోవైపు కొద్ది గంటల్లోనే నెల రోజుల వర్షం కురిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జూన్లో భారీ వర్షాలు, ఆగస్టు లేదా అక్టోబరులో తీవ్ర పొడి వాతావరణం వంటి అసాధారణ పరిస్థితులు సాధారణమైపోతున్నాయి. పశ్చిమ వాతావరణ కల్లోలాలు, వేడి గాలులు, ఆకస్మిక తుఫాన్లు సంప్రదాయ వాతావరణ చక్రాన్ని పూర్తిగా మార్చేశాయి. ఈ పరిస్థితుల్లో రైతులు గత అనుభవాల ఆధారంగా పంటలు వేయడం ప్రమాదకరంగా మారుతోంది.
ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గితే దాని ప్రభావం కేవలం రైతులకే పరిమితం కాదు. మార్కెట్లో ధరలు పెరుగుతాయి. పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతుంది. గోధుమలు, బియ్యం, పప్పులు, వంటనూనెల ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం కూడా అధికమవుతుంది. గతంలో గోధుమలు, కొన్ని రకాల బియ్యం, చక్కెర ఎగుమతులపై ఆంక్షలు విధించాల్సి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం దేశీయ అవసరాలను ముందుగా తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడటమే.
ప్రపంచ పరిస్థితులు కూడా భారత్కు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, యుద్ధాలు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు కారణంగా ఇంధనాలు, ఎరువులు, ఖనిజాల ధరలు పెరుగుతున్నాయి. ఇవి వ్యవసాయ వ్యయాన్ని మరింత పెంచుతున్నాయి. ఖరీఫ్ సీజన్‌కు ఎరువుల నిల్వలు ఉన్నప్పటికీ, రబీ సీజన్‌కు సరిపోతాయా అనే సందేహాలు ఉన్నాయి. వాతావరణ మార్పుల కారణంగా పంటలపై తెగుళ్లు పెరిగితే పురుగుమందుల అవసరం కూడా అధికమవుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు మాత్రమే సరిపోవు. రైతులు వాతావరణానికి అనుగుణంగా పంటల ఎంపిక, సాగు పద్ధతులు మార్చుకోవాలి. మట్టిలో సేంద్రియ పదార్థాన్ని పెంచడం కూడా అత్యంత అవసరం. ఆవుపేడ, కంపోస్ట్, పెరటి ఎరువులు, జీవబొగ్గు వంటి సహజ వనరులను వినియోగించడం ద్వారా నేల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. దీంతో వర్షాలు ఆలస్యమైనా పంటలకు రక్షణ లభిస్తుంది. రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గిస్తూ సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
అదే సమయంలో పంటల బీమా వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయాలి. ముఖ్యంగా వర్షాధార ప్రాంతాల్లోని రైతులందరికీ బీమా రక్షణ కల్పించాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు త్వరితగతిన పరిహారం అందేలా వ్యవస్థను బలోపేతం చేయాలి. అలాగే బహుళ పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా ఒకే పంటపై ఆధారపడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. దేశ ఆహార భద్రతను కాపాడాలంటే ఉత్పత్తి పెరగడం మాత్రమే కాదు.. నిల్వ సామర్థ్యం కూడా పెరగాలి. ప్రస్తుతం పంట కోత తర్వాత సరైన గిడ్డంగులు లేక లక్షల టన్నుల ధాన్యం వృథా అవుతోంది. ప్రతి గ్రామం లేదా మండల స్థాయిలో ఆధునిక గిడ్డంగులు నిర్మించి, రైతుల భాగస్వామ్యంతో నిర్వహించే విధానాన్ని అమలు చేయాలి. యువ పారిశ్రామికవేత్తలను ఈ రంగంలో ప్రోత్సహిస్తే గ్రామీణ ఉపాధి పెరగడంతో పాటు ఆహార నిల్వ వ్యవస్థ కూడా బలపడుతుంది.
వాతావరణ మార్పులు ఇక తాత్కాలిక సమస్య కాదు. రాబోయే దశాబ్దాల్లో ఇవే వ్యవసాయ విధానాలను నిర్ణయించే ప్రధాన అంశంగా మారనున్నాయి. అందువల్ల ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, రైతులు, సమాజం కలిసి ముందస్తు ప్రణాళికతో పనిచేయాలి. వాతావరణ సమాచారాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లాలి. నీటి సంరక్షణ, మట్టి ఆరోగ్యం, వాతావరణానికి అనుగుణమైన వ్యవసాయ విధానాలు, బలమైన నిల్వ వ్యవస్థ, సమర్థవంతమైన పంటల బీమా, రైతులకు ఆర్థిక భరోసా వంటి అంశాలను సమగ్రంగా అమలు చేస్తేనే ఈ సవాలును ఎదుర్కోగలం.
ఎల్‌నినో ప్రభావాన్ని మనం ఆపలేము. కానీ దాని వల్ల కలిగే నష్టాన్ని తగ్గించవచ్చు. అందుకు ఇప్పటి నుంచే సరైన ప్రణాళిక, శాస్త్రీయ దృష్టి, సమర్థమైన ప్రభుత్వ విధానాలు, రైతులకు సకాలంలో మద్దతు అత్యవసరం. లేకపోతే వాతావరణ సంక్షోభం కేవలం వ్యవసాయాన్నే కాదు.. దేశ ఆహార భద్రతను, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, కోట్లాది ప్రజల జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది.
– వనకల్ల వీరప్ప
