ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో షీ టీం అవగాహన సదస్సు
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ: మహిళల భద్రత, చట్టపరమైన రక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం షీ టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా. బి. రాములు మాట్లాడుతూ.. విద్యార్థులు సమాజంలో నెలకొన్న పరిస్థితులను అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టడంతో పాటు క్రమశిక్షణ, మంచి ప్రవర్తన, లక్ష్యసాధన ద్వారా ఉత్తమ భవిష్యత్తును నిర్మించుకోవచ్చని తెలిపారు.
అనంతరం మహిళా కానిస్టేబుల్ స్వాతి మాట్లాడుతూ.. విద్యార్థినులు, విద్యార్థులకు మహిళా భద్రత, చట్టపరమైన హక్కులు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్ అందిస్తున్న సేవలు, ఫిర్యాదు చేసే విధానంపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ డా. బి. రాములు అధ్యక్షత వహించారు. హెడ్ కానిస్టేబుల్ కె. శ్రీనివాస్, మహిళా కానిస్టేబుల్ స్వాతి, ఎస్. కుమారస్వామి, అధ్యాపకులు, విద్యార్థినులు, విద్యార్థులు పాల్గొన్నారు.
