షటిల్‌లో సత్తా చాటిన మైలవరం విద్యార్థి హితాన్స్

జిల్లా స్థాయి అండర్-11 డబుల్స్‌లో స్వర్ణం..

సింగిల్స్‌లో కాంస్యం.. రాష్ట్ర స్థాయికి ఎంపిక

మైలవరం, ఆంధ్రప్రభ : స్థానిక వివేకానంద ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థి కొల్లి హితాన్స్ చదువుతో పాటు షటిల్ బ్యాడ్మింటన్‌లోనూ విశేష ప్రతిభ కనబరుస్తున్నాడు.

ఈ నెల 12న విజయవాడలోని సీహెచ్‌ఆర్‌కేవీఎంసీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో అండర్-11 సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పాల్గొన్న హితాన్స్ డబుల్స్ విభాగంలో ప్రథమ స్థానం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే సింగిల్స్ విభాగంలో మూడో స్థానం సాధించి కాంస్య పతకాన్ని అందుకున్నాడు.

అత్యుత్తమ ఆటతీరుతో సెలక్టర్లను ఆకట్టుకున్న హితాన్స్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై మైలవరం ప్రాంతానికి గర్వకారణంగా నిలిచాడు. తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం అందిస్తున్న ప్రోత్సాహంతో చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.

ఈ సందర్భంగా జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన హితాన్స్‌ను పాఠశాల ప్రిన్సిపాల్ మల్లెల వెంకట శ్రీనివాసరావు, కరస్పాండెంట్ పాములపాటి రాజారెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లోనూ మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, మైలవరం ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.