పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలి

30 శాతం ఐఆర్ ప్రకటించాలని ఫ్యాప్టో డిమాండ్..

కర్నూలులో భారీ ర్యాలీ, కలెక్టరేట్ ముట్టడి

కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ : పీఆర్సీ కమిటీని వెంటనే ఏర్పాటు చేసి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో కర్నూలులో మంగళవారం భారీ ర్యాలీ, నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు సుమారు 500 మందికి పైగా ఉపాధ్యాయులు ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ర్యాలీని ఫ్యాప్టో రాష్ట్ర కో-చైర్మన్, జిల్లా ఇన్‌చార్జి కాకి ప్రకాష్‌రావు ప్రారంభించారు. ఉపాధ్యాయులు “పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలి”, “30 శాతం ఐఆర్ ప్రకటించాలి” అంటూ నినాదాలు చేస్తూ రాజ్‌విహార్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అనంతరం జరిగిన పికెటింగ్‌కు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ ఎం. మధుసూదన్ రెడ్డి, సెక్రటరీ జనరల్ భాస్కర్ నాయకత్వం వహించారు.

ఈ సందర్భంగా కాకి ప్రకాష్‌రావు మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. మెరుగైన పీఆర్సీ ఇస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హామీలు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

పలు సమస్యలపై డిమాండ్లు

యూటీఎఫ్ జిల్లా నాయకుడు రవికుమార్ నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు.

ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు జనార్దన్ ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా కేంద్రానికి చట్ట సవరణ ప్రతిపాదనలు పంపాలని డిమాండ్ చేశారు.

ఏపీటీఎఫ్-257 నాయకుడు పాండురంగారెడ్డి ఉద్యోగుల హెల్త్ కార్డుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందేలా వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు.

ఏపీటీఎఫ్-1938 నాయకుడు ఇస్మాయిల్ కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రధానోపాధ్యాయ సంఘం నాయకుడు నారాయణ ఉమ్మడి సర్వీస్ రూల్స్‌ను అమల్లోకి తీసుకురావాలని కోరగా, డీటీఎఫ్ నాయకుడు భీమన్న సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఆప్టా జిల్లా నాయకుడు గోపాల్ ఉపాధ్యాయులను బోధనేతర విధులకు దూరంగా ఉంచాలని సూచించగా, పీఈటీ అసోసియేషన్ నాయకుడు లక్ష్మయ్య స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శుల నియామకాల్లో సీనియారిటీకి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

బీటీఏ నాయకులు నందీశ్వరుడు, వెంకటేష్ 2025లో బదిలీలు పొందిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నిరసన కార్యక్రమంలో యూటీఎఫ్, ఎస్టీయూ, ఏపీటీఎఫ్-257, ఏపీటీఎఫ్-1938, డీటీఎఫ్, ప్రధానోపాధ్యాయ సంఘం, ఆప్టా, పీఈటీ అసోసియేషన్ తదితర ఉపాధ్యాయ సంఘాల నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, పీడీఎస్‌యూ, డీఎస్‌ఎఫ్, పీడీఎస్‌వో, ఏపీ జేఏసీ, ఏపీఎన్‌జీఓ తదితర సంఘాలు సంఘీభావం ప్రకటించాయి.

నిరసన అనంతరం ఫ్యాప్టో రాష్ట్ర నాయకులు కాకి ప్రకాష్‌రావు, జిల్లా సెక్రటరీ జనరల్ భాస్కర్‌తో పాటు ఇతర నాయకులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.