‘పొలం పిలుస్తోంది’తో రైతులకు అవగాహన

మోపిడి, ఆమిద్యాల గ్రామాల్లో పంటల పరిశీలన..

పంట బీమా, పంటల సంరక్షణపై రైతులకు సూచనలు

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని మోపిడి, ఆమిద్యాల గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన వేరుశనగ, కంది పంటలను పరిశీలించి రైతులతో ముఖాముఖి నిర్వహించారు.

మండల వ్యవసాయ అధికారి రామకృష్ణుడు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ తదితర పథకాలపై అవగాహన కల్పించారు. పథకాల అమలులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలను వివరించారు.

ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వేరుశనగ, కంది పంటలను రక్షించేందుకు లీటరు నీటికి 2 గ్రాముల యూరియా లేదా పొటాషియం నైట్రేట్ కలిపి పిచికారీ చేయాలని సూచించారు. దీంతో పంటలు ఎండబారే పరిస్థితిని కొంతవరకు తట్టుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

రైతులు వాతావరణ బీమా, ఫసల్ బీమా పథకాలలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. వాతావరణ బీమా కింద వివిధ పంటలకు నిర్ణయించిన ప్రీమియం వివరాలను వెల్లడిస్తూ, అవసరమైన పత్రాలైన భూ పాస్‌బుక్, రైతు ధ్రువీకరణ పత్రం, బ్యాంకు పాస్‌బుక్, ఆధార్ కార్డు జిరాక్స్‌లతో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. వాతావరణ బీమా గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించినట్లు తెలిపారు. ఫసల్ బీమా పథకం కింద కంది పంటకు ఎకరాకు రూ.80 ప్రీమియం చెల్లించాలని రైతులకు సూచించారు.