చౌటుప్పల్ ఆలయంలో ఘనంగా శ్రీ కాశివిశ్వనాథునికి అన్నపోషిత అభిషేకం

​సకాలంలో వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు

​చౌటుప్పల్, ఆంధ్రప్రభ : లోక కల్యాణార్థం, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి జగమంతా సుభిక్షంగా ఉండాలనే సత్సంకల్పంతో చౌటుప్పల్‌లోని శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ కాశివిశ్వనాథ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్యేష్ఠ మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం, కలిసి వచ్చిన పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేషంగా ‘అన్నం’తో (అన్నాభిషేకం) మహా అభిషేకాన్ని వైభవంగా జరిపించారు. ​ఆలయ ప్రధాన అర్చకులు పెద్ది సుధాకర శర్మ నేతృత్వంలో అర్చకులు కృష్ణ కిషోర్ శర్మ, సతీష్ శర్మ లు శాస్త్రోక్తంగా, ఘనంగా ఈ క్రతువును నిర్వహించారు.

జ్యేష్ఠ బహుళ చతుర్దశి పర్వదినాన శివునికి అన్నాభిషేకం చేయడం వల్ల సృష్టిలోని సమస్త జీవులకు అన్నపానాదులకు కొరత లేకుండా వానలు కురుస్తాయని అర్చకులు తెలిపారు. భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని తరించారు. అభిషేకం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాద వితరణ చేశారు. ​ఈ విశేష పూజా కార్యక్రమంలో దేవాలయ మాజీ ధర్మకర్త ఉప్పల కృష్ణ గుప్త, కుసుమ, కేదారినాథ్, దీపిక, కొంపల్లి సత్యనారాయణ, జయలక్ష్మి, దాచేపల్లి నాగమణి, లక్ష్మి, యమున, వీరమళ్ల సూర్యనారాయణ, భూపాల్, లింగారెడ్డి, తెలుకుంట్ల వసంత, వాణి, సునీత, కావ్య, సత్యనారాయణ, భాస్కర్, రోజా తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.