Forest Suspension | ఇద్దరు అటవీ అధికార్ల సస్పెన్షన్..

విధుల్లో నిర్లక్ష్యం వహించారని..

Forest Suspension | జన్నారం, ఆంధ్రప్రభ: విధుల్లో నిర్లక్ష్యం వహించారనే అభియోగం మేరకు ఇద్దరు అటవీ అధికార్లను అటవీ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం సస్పెండ్ చేశారు.కవ్వాల టైగర్ రిజర్వ్ లోని జన్నారం అటవీ డివిజనల్ పరిధిలోని చింతగూడ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బి. భోజానాయక్ ను కాలేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్ సస్పెండ్ చేయగా,పైడిపల్లి బీట్ ఆఫీసర్ పి.శ్రీకాంత్ ను మంచిర్యాల డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ సస్పెండ్ చేశారు.ఈ మేరకు స్థానిక ఎఫ్డీఓ కార్యాలయానికి ఇద్దరు అటవీ అధికారుల సస్పెన్షన్ ఆదేశాలు వచ్చినట్లు ఎఫ్డీఓ ఎం. రామ్మోహన్ సాయంత్రం తెలిపారు.ఆ ఇద్దరు అధికార్లను విధుల్లో నిర్లక్ష్యం వహించారని ఆరోపణలతో సస్పెండ్ చేశారని ఆయన చెప్పారు.ఆ సస్పెన్షన్ ఆదేశాలను రేంజ్ కార్యాలయంకు పంపినట్లు ఆయన తెలిపారు.

ఇసుక అక్రమ రవాణానే కారణం..

జన్నారం అటవీ డివిజనల్ పరిధిలోని పైడిపల్లి అటవీ బీటులో కొత్త పుట్టిగూడ గ్రామంలో సీసీ రోడ్డు పనుల కోసం అటవీ ప్రాంతం నుంచి ఇసుకను తరలించారనే సమాచారం మేరకు రాష్ట్ర అటవీ శాఖ విజిలెన్స్ డీఎఫ్ఓ శివయ్య బృందం విచారణ చేశారు.గత రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ఆ బృందం వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించి వెళ్లారు.ఆ ఇసుక అక్రమ రవాణాలో ఇద్దరు అటవీ అధికార్లు భోజానాయక్, శ్రీకాంత్ లకు ప్రమేయం ఉందని భావించి అటవీ శాఖ ఉన్నతాధికార్లు సస్పెండ్ చేసినట్లు బోగట్ట.

జన్నారం రేంజులో సస్పెన్షన్ లో 6 గురు అటవీ అధికార్లు..
అటవీ అధికారుల్లో ఆందోళన..

జన్నారం అటవీ డివిజనల్ పరిధిలో ఇప్పటికీ ఆరుగురు అటవీ అధికారులను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం వారంతా సస్పెన్షన్ లోనే ఉన్నారు. జన్నారం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కుమారస్వామి, ఫారెస్ట్ సెక్షన్,బీట్ ఆఫీసర్లు ఇంతియాజ్, లవన్ కుమార్,పరమేశ్వర్ లను గతంలో సస్పెండ్ చేయగా,తాజాగా సెక్షన్, బీట్ ఆఫీసర్లు భోజానాయక్,శ్రీకాంత్ లను మంగళవారం అటవీ శాఖ ఉన్నతా ధికార్లు సస్పెండ్ చేశారు. దీంతో అటవీ శాఖ అధికారుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.ప్రతి చిన్న కారణాలతో అటవీ అధికారులను సస్పెండ్ చేయడం పట్ల భయం గుబులు పట్టుకుంది. దీంతో కవ్వాల టైగర్ రిజర్వ్ లోని జన్నారం అటవీ డివిజనల్ లో పనిచేయడానికి ఫారెస్ట్ రేంజ్,డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు,అటవీశాఖ సెక్షన్,బీట్ అధికార్లు ముందుకు రావడంలేదని సమాచారం.