Narsampet | ఆ రెండూ ఉంటేనే గ్రామాభివృద్ధి…
Narsampet | ఆ రెండూ ఉంటేనే గ్రామాభివృద్ధి…
- గ్రామసభలో ప్రజలకు అవగాహన కల్పించిన ఏసీపీ, ఆర్డీవో
నర్సంపేట రూరల్ (ఆంధ్రప్రభ): గురిజాల గ్రామంలో శనివారం సర్పంచ్ బండారి చందర్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏసీపీ, ఆర్డీవో ప్రజలకు శాంతిభద్రతలు, సైబర్ నేరాల నివారణ, ఘన వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రత తదితర అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సమాజం ప్రశాంతంగా ఉండాలన్నా, గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా శాంతిభద్రతలు ఎంతో కీలకమని అన్నారు. నేరాలు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందుగానే ప్రజలను అప్రమత్తం చేసి నేరాల బారిన పడకుండా చూడడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలు, పోలీసుల మధ్య సమన్వయం పెంపొందితే సంఘ విద్రోహ శక్తులను సమర్థవంతంగా అడ్డుకోవచ్చన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలు, మత్తు పదార్థాల వినియోగం, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆర్డీవో మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు చెత్తను సంపదగా మార్చే దిశగా ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా ప్రతి ఇంట్లోనే తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలను వేర్వేరుగా సేకరించాలని సూచించారు. ఆకుపచ్చ బుట్టలో తడి చెత్త, నీలం బుట్టలో పొడి చెత్త, ఎరుపు బుట్టలో ప్రమాదకర వ్యర్థాలను వేయాలని వివరించారు.
తడి చెత్తతో సేంద్రీయ ఎరువును తయారు చేయడం, పొడి చెత్తను రీసైక్లింగ్‌కు పంపించడం ద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ప్రతి ఇంటి నుంచి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు పారిశుధ్య సిబ్బంది, స్వచ్ఛతా వాహనాల సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. గ్రామంలో డంపింగ్ యార్డులను అభివృద్ధి చేసి “చెత్తతో సంపద” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం, పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించడం వంటి చర్యలపై గ్రామ పంచాయతీలు జరిమానాలు విధించేలా చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. గ్రామాన్ని ఆరోగ్యవంతమైన, పరిశుభ్రమైన, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, కమ్యూనిటీ అసిస్టెంట్లు, మహిళలు, యువత, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమం, పరిశుభ్రత పరిరక్షణలో గ్రామసభలు కీలక పాత్ర పోషిస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు.
