సర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి: కలెక్టర్
ఉమ్మడి వరంగల్ (ఆంధ్రప్రభ): ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా సమర్థవంతంగా పూర్తి చేయాలని, ఫారాల స్వీకరణతో పాటు డిజిటలైజేషన్ ప్రక్రియను సమాంతరంగా చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ పట్టణంలోని దీన్‌దయాళ్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ వద్ద కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బీఎల్‌వోలు నిర్వహిస్తున్న ఫారాల పంపిణీ, స్వీకరణ, నమోదు, డిజిటలైజేషన్ విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు.
కొత్త ఓటర్ల నమోదు, మరణించిన ఓటర్ల వివరాలు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారి సమాచారం, చిరునామా మార్పులు తదితర అంశాల నమోదుపై బీఎల్‌వోలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నమోదు చేయాలని సూచించారు. ప్రజల నుంచి స్వీకరించే ఫారాలను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే డిజిటలైజేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. పరకాల నియోజకవర్గంలో డిజిటలైజేషన్ దాదాపు పూర్తయిందని, అదే తరహాలో హనుమకొండ పశ్చిమ నియోజకవర్గంలో వచ్చే ఆదివారం నాటికి వంద శాతం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొంటూ, బీఎల్‌వోలకు ప్రజలు సహకరించాలని, బీఎల్‌ఏలు కూడా సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ పరిశీలనలో ఆర్డీవో వెంకటేష్, తహసీల్దార్ రవీంద్రరెడ్డి, సంబంధిత అధికారులు, బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
