కొమరం భీం విగ్రహానికి రూ.లక్ష విరాళం..
ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖానాపూర్ నియోజకవర్గంలోని సిరికొండ మండల ఆదివాసీ నాయకులు మంగళవారం ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
సిరికొండ మండల కేంద్రంలో కొమరం భీం విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నాయకులు ఎమ్మెల్యేకు వివరించారు. దీనికి స్పందించిన బొజ్జు పటేల్ తన వంతు సహాయంగా రూ.1 లక్ష విరాళాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ, గిరిజన, ఆదివాసీ పోరాట యోధుల స్ఫూర్తిని భావితరాలకు చాటిచెప్పే కార్యక్రమాలకు ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు, ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
