ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం డిమాండ్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని సీపీఎం చౌటుప్పల్ మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన స్థానికంగా కరపత్రాన్ని విడుదల చేశారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కేంద్రం ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోవాలని, 10 లక్షల ఖాళీలను భర్తీ చేయాలని కోరారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని, పోలీస్ శాఖలోని 20 వేల ఖాళీలను భర్తీ చేయాలని, నెలకు రూ. 5 వేల నిరుద్యోగ భృతితో పాటు జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై ఈ నెల 15న హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా ధర్నాను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, యువతకు కరుణాకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ పాషా, నాయకులు బత్తుల దాసు, తూర్పునూరి మల్లేశం, అందగట్ల ఆనంద్, కనకయ్య, ఈదయ్య, జంగయ్య, రాములు, రాజు తదితరులు పాల్గొన్నారు.