ఆటిజం కేంద్రాల బలోపేతానికి చర్యలు..

సమగ్ర విద్యతో ప్రతి చిన్నారి అభివృద్ధే లక్ష్యం
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్

బాపట్ల, ఆంధ్రప్రభ : సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా ఆటిజం సహాయక కేంద్రాలు, సమగ్ర విద్య కార్యక్రమాలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందరికీ విద్య – అందరికోసం విద్య అనే లక్ష్యంతో ప్రతి చిన్నారికి సమాన అవకాశాలు కల్పించడం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరిచేందుకు ఆటిజం సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి, శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించడం అభినందనీయమన్నారు.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి పనిచేస్తే ప్రత్యేక అవసరాలున్న పిల్లలు మరింత మెరుగైన జీవితాన్ని గడపగలరని చెప్పారు. బాపట్లలో ప్రత్యేక సీఎస్ కోన శశిధర్ ప్రతిపాదనల మేరకు ఆటిజం సహాయక కేంద్రం ఏర్పాటు చేశామని, ప్రస్తుతం 17 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. భవిత కార్యక్రమంలోని 21 విభాగాలకు అనుగుణంగా సేవలు విస్తరించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 119 మంది శిక్షకుల నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపికైన వారిని డిప్యుటేషన్‌పై నియమించనున్నట్లు చెప్పారు. శిక్షకులకు అదనంగా రూ.1,000, ఆయాలకు రూ.2,000 ప్రోత్సాహకం అందించేందుకు చర్యలు తీసుకుంటామని, అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందని తెలిపారు. ఆటిజం కేంద్రాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఆటిజం ప్లస్ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్, మొబైల్ యాప్ రూపొందించి విద్యార్థుల వివరాలు, రోజువారీ శిక్షణ ప్రణాళికలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. కేంద్రాల్లోనే విద్యార్థులకు ఆధార్ నమోదు, సదరం ధ్రువీకరణ పత్రాలు, పెన్షన్ దరఖాస్తులు వంటి సేవలను అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రత్యేక నైపుణ్యాలు బోధించగల నిపుణులు ముందుకు వచ్చి సహకరించాలని కోరారు.

విద్యార్థులపై ఐఐటీ, ఐఏఎస్ వంటి లక్ష్యాలను బలవంతంగా రుద్దకుండా, వారి ఆసక్తి, సామర్థ్యాలకు అనుగుణంగా ప్రోత్సహించాలని సూచించారు. తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఇంటి వద్ద కూడా పిల్లలకు శిక్షణ అందేలా కంప్యూటర్ ల్యాబ్‌ల ద్వారా మార్గదర్శకత్వం కల్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ సింగ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, డి సి హెచ్ ఎస్ డాక్టర్ పద్మావతి, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి మాధవి, డి ఆర్ డి ఎ పిడి సింగయ్య, శిక్షణ పొందుతున్న ఉద్యోగులు, ఆయాలు, సమగ్ర శిక్ష అధికారులు, ప్రత్యేక విద్యా శిక్షకులు, ఆటిజం కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.