గుణదల ఈఎస్ఐ ఆసుపత్రి అభివృద్ధి చేస్తాం..
విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని..
ఆసుపత్రిని సందర్శించి వైద్యులు, నర్సులతో మాట్లాడిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్
సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తానని హామీ
155 పడకల ఆసుపత్రిని 300 పడకల సూపర్ స్పెషాలిటీగా అప్గ్రేడ్ చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి..
ఈఎస్ఐ అర్హత రూ.42 వేల వేతనం వరకు పెరగడంతో కార్డుదారులు భారీగా పెరిగే అవకాశం..
పోస్టుల భర్తీ, వైద్య కళాశాల ఏర్పాటు దిశగా కృషి చేస్తానన్న ఎంపీ చిన్ని
గుణదల, ఆంధ్రప్రభ : విజయవాడ గుణదలలోని ఉద్యోగుల రాష్ట్ర బీమా (ఈఎస్ఐ) ప్రధాన ఆసుపత్రిని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మంగళవారం సందర్శించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆయన, వైద్యులు, నర్సులు, సిబ్బందితో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది కొరత, వైద్య సేవల విస్తరణ, మౌలిక వసతుల పెంపు, పోస్టుల భర్తీ వంటి అంశాలను వైద్య సిబ్బంది ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ, 1965లో ప్రారంభమైన విజయవాడ ఈఎస్ఐ ఆసుపత్రి ప్రస్తుతం సుమారు మూడు లక్షల మంది కార్డుదారులకు వైద్య సేవలు అందిస్తోందన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ అర్హతను నెలకు రూ.21 వేల వేతనం నుంచి రూ.42 వేల వరకు పెంచడంతో కార్డుదారుల సంఖ్య మరో రెండు నుంచి మూడు రెట్లు పెరిగి సుమారు తొమ్మిది లక్షలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు.
ఇంత పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు ఉన్న నేపథ్యంలో ఆసుపత్రిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఈఎస్ఐ పరిధిలో అందుబాటులో లేని వైద్య సేవల కోసం 21 రిఫరల్ ఆసుపత్రులకు రోగులను పంపిస్తున్నారని పేర్కొన్నారు. మూడు లక్షల మందికి పైగా కార్డుదారులు ఉన్న ఆసుపత్రికి కనీసం 300 పడకల సామర్థ్యం కలిగిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అవసరమని అన్నారు. ఇటీవల 155 పడకల ఆసుపత్రికి ఆమోదం లభించినప్పటికీ, దానిని 300 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా విస్తరించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విజయవాడ నగర నడిబొడ్డున సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆసుపత్రికి అన్ని ప్రత్యేక వైద్య విభాగాలు, ఆధునిక సదుపాయాలు, వైద్య కళాశాల అనుసంధానం ఉండేలా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ హామీ ఇచ్చారు.

ఈఎస్ఐ కార్డుదారుల సంఖ్యకు అనుగుణంగా దేశంలోని ఇతర ప్రాంతాల్లో మెడికల్ కళాశాలలు అనుసంధానమై ఉన్నాయని, విజయవాడలో కూడా అలాంటి సదుపాయం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆసుపత్రిలో పోస్టుల కొరతను కూడా గుర్తించిన ఎంపీ, ఖాళీల భర్తీతో పాటు అవసరమైన సిబ్బందిని నియమించే అంశాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి, సంబంధిత కార్యదర్శుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో గుణదల ఈఎస్ఐ ఆసుపత్రి అభివృద్ధి, సిబ్బంది నియామకాలు, సూపర్ స్పెషాలిటీ హోదా, మౌలిక సదుపాయాల విస్తరణ అంశాలను ప్రస్తావించి, కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు, నిధులు వచ్చేలా తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఆసుపత్రి పరిశుభ్రత, నిర్వహణ ఎంతో సంతృప్తికరంగా ఉందని ప్రశంసించిన ఎంపీ, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఆసుపత్రి కూడా ఆధునికీకరణ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అన్ని విధాలా సహకారం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

