mobilephone | చ‌దువుల పోటీలో సెల‌వుల్లోనూ కోచింగ్‌లు

mobilephone | చ‌దువుల పోటీలో సెల‌వుల్లోనూ కోచింగ్‌లు

mobilephone | మొబైల్ ఫోన్ల మధ్య నలుగుతున్న చిరుప్రాయాలు
గ్రామీణ జీవనశైలి, పాతకాలపు ఆటలు, బంధుత్వాలకు క‌టీఫ్‌
పిల్లల జీవన విధానం ఆందోళనకరం

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: ఒకప్పుడు వేసవి సెలవులు వచ్చాయంటే పట్టణాల్లో చదువుకుంటున్న పిల్లలు పల్లెల బాట పట్టేవారు. అమ్మమ్మ, తాతయ్యల ఇళ్లకు వెళ్లి అక్కడి ప్రకృతి వాతావరణంలో ఆనందంగా గడిపేవారు. గ్రామాల్లోని బావులు, చెరువులు, కాలువలు, కుంటల వద్దకు వెళ్లి గంటల తరబడి ఈత కొట్టడం అప్పటి పిల్లల ముఖ్య వినోదంగా ఉండేది. పండ్ల తోటల్లోకి వెళ్లి మామిడికాయలు, ఈతకాయలు, చీమచింత వంటి పండ్లను తెచ్చుకొని తినడం ప్రత్యేక ఆనందాన్ని ఇచ్చేది. అంతేకాకుండా చిల్లాకట్టి, బొంగరాలు తిప్పడం, గిల్లి డండా, కబడ్డీ, దొంగాట, పోలీస్-దొంగ వంటి సంప్రదాయ ఆటలు గ్రామ వీధులను సందడిగా మార్చేవి. రాత్రివేళల్లో చంద్రకాంతిలో పిల్లల కేరింతలు గ్రామాల్లో మారుమోగేవి. అప్పట్లో పిల్లల్లో ఈగోలు, వ్యక్తిగత ద్వేషాలు ఉండేవి కావు. అందరూ కలిసిమెలిసి ఆటపాటలతో సంతోషంగా కాలం గడిపేవారు.

సంప్రదాయ ఆటలకు దూరం
అయితే కాలక్రమేణా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరగడం, సెల్‌ఫోన్ వినియోగం అధికమవడంతో పిల్లలు సంప్రదాయ ఆటలకు దూరమయ్యారు. ప్రస్తుతం రెండు, మూడు సంవత్సరాల చిన్నారులు కూడా మొబైల్ ఫోన్ లేకుండా భోజనం చేయని పరిస్థితి నెలకొంది. తల్లిదండ్రులు కూడా పిల్లలను అలరించేందుకు సెల్‌ఫోన్లకు అలవాటు చేస్తున్నారు. దీంతో చిన్న వయస్సులోనే పిల్లలు మొబైల్‌లకు బానిసలుగా మారుతున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంట్లో నలుగురు ఉన్నా నలుగురూ తమ తమ మొబైల్ ఫోన్లలోనే మునిగిపోయి పరస్పర సంభాషణలకు కూడా దూరమవుతున్నారు. వేసవి సెలవులు వచ్చినా బయట ఆటలు, స్నేహితులతో గడపడం, ప్రకృతిని ఆస్వాదించడం వంటి విషయాలకు ప్రాధాన్యత తగ్గిపోయింది. పిల్లలు ఎక్కువ సమయం వీడియో గేమ్స్, సోషల్ మీడియా, మొబైల్ వినోదాలకే కేటాయిస్తున్నారు. ఇప్పటికే వేసవి సెలవులు ప్రారంభమై రెండు వారాలకు పైగా అయినప్పటికీ పాతకాలపు ఉత్సాహం కనిపించడం లేదని పలువురు పెద్దలు అభిప్రాయపడుతున్నారు. గ్రామాలకు వెళ్లి బావుల్లో ఈత కొట్టడం, చెట్లెక్కి పండ్లు కోయడం వంటి అనుభవాలు నేటి పిల్లలకు దాదాపు తెలియని పరిస్థితి ఏర్పడింది.

సెల‌వుల్లోనూ త‌ర‌గ‌తులు
ఇక మరోవైపు విద్యా వ్యవస్థలో పెరుగుతున్న పోటీ కారణంగా వేసవి సెలవులు కూడా విద్యార్థులకు పూర్తిస్థాయి విశ్రాంతిని ఇవ్వడం లేదు. ముఖ్యంగా పదవ తరగతి చదివే విద్యార్థులకు అనేక విద్యాసంస్థలు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాయి. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో సెలవుల సమయంలో కూడా స్కూల్స్‌కు పిలిపించి పాఠాలు బోధిస్తున్నారు. దీంతో విద్యార్థుల స్వేచ్ఛ, ఆటపాటలకు సమయం లేకుండా పోతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను వివిధ ప్రత్యేక శిక్షణా కేంద్రాలకు పంపుతున్నారు. ముఖ్యంగా కరాటే, డాన్స్, స్పోకెన్ ఇంగ్లిష్, అబాకస్, మ్యాథ్స్ కోచింగ్ వంటి కోర్సులకు పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది. జిల్లా వ్యాప్తంగా డాన్స్ అకాడమీలు, కరాటే శిక్షణ కేంద్రాలు, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లు విస్తృతంగా ప్రారంభమయ్యాయి.

పిల్లలపై పెరుగుతున్న ఒత్తిడి
డాన్స్ శిక్షణ కోసం 40 రోజుల కోర్సుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. అలాగే ఇంగ్లిష్, గణితం వంటి సబ్జెక్టులకు ప్రత్యేక కోచింగ్ పేరుతో వేల రూపాయలు తీసుకుంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇవి అవసరమని తల్లిదండ్రులు భావిస్తున్నప్పటికీ చిన్న వయస్సులోనే పిల్లలపై ఒత్తిడి పెరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

స్విమ్మింగ్ పూల్స్‌కు డిమాండ్‌
ఇక ఎండాకాలం తీవ్రత పెరగడంతో స్విమ్మింగ్ పూల్స్‌కు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. ఉదయం, సాయంత్రం సమయాల్లో పిల్లలు, యువత ఈత శిక్షణ కోసం స్విమ్మింగ్ పూల్స్‌కు పరుగులు తీస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు ఈత నేర్పించడం ద్వారా ఆరోగ్య పరిరక్షణతో పాటు ప్రమాదాల నివారణకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ఒకప్పుడు ఆటపాటలతో, ప్రకృతితో, బంధుత్వాలతో కళకళలాడిన వేసవి సెలవులు ఇప్పుడు కోచింగ్‌లు, శిక్షణలు, మొబైల్ ఫోన్ల మధ్య నలిగిపోతున్నాయనే భావన వ్యక్తమవుతోంది. పిల్లలు విద్యతో పాటు మానసిక ఆనందం, శారీరక వ్యాయామం, సామాజిక సంబంధాలు కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు సూచిస్తున్నారు.

CLICK HERE TO READ పర్యటనల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ సమీక్ష

CLICK HERE TO READ MORE