Breaking news | HMDA చీఫ్ ఇంజినీర్ ఇంటిపై ఏసీబీ సోదాలు..

Breaking news | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణలో అవినీతిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో హెచ్‌ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ) చీఫ్ ఇంజినీర్ రవీందర్‌కు సంబంధించిన నివాసం, కార్యాలయం, సన్నిహితుల ఇళ్లలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు.

ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. నగరంలోని 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ బృందాలు కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను పరిశీలిస్తున్నాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం, సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభించినట్లు తెలుస్తోంది. అయితే స్వాధీనం చేసుకున్న నగదు, ఆస్తుల విలువపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సోదాలు పూర్తయిన అనంతరం పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, పెద్దపల్లి జిల్లాలో కూడా ఏసీబీ అధికారులు లంచం కేసులో ఓ అధికారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ)గా పనిచేస్తున్న సతీష్ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు క్లియర్ చేయడానికి ఏఈ సతీష్ లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధిత కాంట్రాక్టర్ బత్తు శ్రీనివాస్ ఏసీబీని ఆశ్రయించగా, ముందస్తు ప్రణాళిక ప్రకారం అధికారులు ఉచ్చుపన్ని లంచం స్వీకరిస్తున్న సమయంలో సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.