వరప్రసాద్ రెడ్డి మృతిపై హోంమంత్రి అనిత సంతాపం.. విచారణకు ఆదేశాలు

కర్నూలు రూరల్ బ్యూరో (ఆంధ్రప్రభ): కర్నూలు నగరంలోని బళ్లారి చౌరస్తా సమీప జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ రెడ్డి (43) మృతిచెందిన ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

మంగళవారం తెల్లవారుజామున ప్రతిరోజులాగే ఉదయం వ్యాయామం కోసం బళ్లారి చౌరస్తా సమీపంలోని జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై జాగింగ్ చేస్తున్న సమయంలో వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం వరప్రసాద్ రెడ్డిని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆయన ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడటంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని వాహనాన్ని గుర్తించేందుకు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

హోంమంత్రి అనిత మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే పోలీసు సిబ్బందిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వరప్రసాద్ రెడ్డి ఆకస్మిక మృతితో పోలీసు శాఖలో విషాదఛాయలు అలుముకున్నాయి. సహచర పోలీసులు, అధికారులు ఆయనకు నివాళులర్పిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.