కూటమి ప్రభుత్వం ఇళ్లు కట్టేదే.. కూల్చేది కాదు..

పాత రాజేశ్వర్రావుపేట బాధితులకు ఎంపి చిన్ని భరోసా
రైల్వే నోటీసులపై దీక్షా శిబిరాన్ని సందర్శించి సమస్య తెలుసుకున్న ఎంపీ
డీఆర్‌ఎం, వీఎంసీ అధికారులతో చర్చించి సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ
ఎంపీ హామీతో విరమించిన స్థానికుల నిరసన దీక్ష
శాశ్వత పరిష్కారం కోసం ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి చర్యలు: చిన్ని

విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్ పరిధిలోని పాత రాజరాజేశ్వరి పేటలో రైల్వే భూమిలో నివసిస్తున్న కుటుంబాలకు జారీ చేసిన నోటీసులపై నిరసన వ్యక్తం చేస్తున్న స్థానికులను విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సోమవారం నేరుగా దీక్షా శిబిరం వద్దకు వెళ్లి పరామర్శించారు. బాధితుల సమస్యలను తెలుసుకుని శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో స్థానికులు తమ నిరసన దీక్షను విరమించారు.

ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ, గత 50 ఏళ్లుగా దిగువ, మధ్యతరగతి కుటుంబాలు స్వంత ఖర్చులతో ఇళ్లు నిర్మించుకుని అక్కడే నివసిస్తున్నాయని, రైల్వే అధికారులు తరచూ నోటీసులు జారీ చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. గతంలో కూడా ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు రైల్వే అధికారులతో మాట్లాడి తాత్కాలిక పరిష్కారం చూపించినట్లు గుర్తు చేశారు. ఈసారి మాత్రం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరడంతో, వెంటనే స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి రైల్వే డీఆర్‌ఎం, సంబంధిత అధికారులు, వీఎంసీ అధికారులతో సమావేశమై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా చూడాలని కోరుతానని తెలిపారు.

అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి సమస్యను తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం సాధించేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. గత వరదల సమయంలో ఈ ప్రాంత పరిస్థితులు ముఖ్యమంత్రికి పూర్తిగా తెలుసని పేర్కొన్న ఎంపీ, ప్రజల ఇళ్లను కాపాడే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. “కూటమి ప్రభుత్వం ఇళ్లు కట్టేదే కానీ కూల్చేది కాదు” అని స్పష్టం చేస్తూ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఆషా, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా, శాప్ డైరెక్టర్ సంతోష్, గొల్లపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాల మాధవ, పలువురు పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.