మంత్రి తుమ్మల కృషి ఫలితమే గోదావరి జలాలు
- మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాకేష్
- బేతపల్లి కాలువ నిర్మాణానికి ముందు వెనక అభివృద్ధిని చూడాలి
- మెతుకు మెతుకు పై మంత్రి తుమ్మల
వేంసూరు, ఆంధ్రప్రభ : కరువు నేలతో కూనవెల్లిన వేంసూరు మండలాన్ని, జలసిరులతో నింపిన ఘనత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కే దక్కుతుందని మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నెల్లూరు రాకేష్ అన్నారు. గోదావరి జలాలు వేంసూరు మండలానికి చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని కుంచపర్తి గ్రామ సమీపంలో ఎన్ఎస్పి కాలువపై నిర్మించిన రెగ్యులేటర్ వద్ద రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గోదావరి జలాలకు పుష్పాభిషేకం సోమవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలం లోని యువకులు మండల వ్యవసాయ చరిత్రను తెలుసు కోవాలన్నారు. బేతపల్లి కాలువ నిర్మాణానికి ముందు, వెనుక చరిత్రను తెలుసు కుంటే, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేపట్టిన అభివృద్ధి అంటే ఏమిటో అవగతమౌతుందన్నారు. ఎటువంటి సాగునీటి సదుపాయం లేక, సరైన వర్షపాతం లేక, కరువు కోరల్లో చిక్కుకున్న వేంసూరు మండలం, ఆనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరువు మండలాల్లో రెండవ స్థానంలో నిలిచిందన్నారు.
ఆనాటి కాలంలో వందల సంఖ్యలో విద్యుత్ బోరుబావులు వేసినప్పటికీ, భూగర్భ జలాలు లేక, బోరు బావులు వేసినా ప్రయోజనం కరువై, రైతాంగం అప్పుల పాలై నిస్సహాయ స్థితిలో ఉన్న స్థితిలో మంత్రి తుమ్మల బేతుపల్లి మిగులు జలాలను అందించి, రైతు, వ్యవసాయ కూలీల కుటుంబాలలో చిరునవ్వులు పండించారన్నారు. భూగర్భ జలాల పెంపుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమయంలో దాదాపు మండలంలో సుమారు 200 చెక్ డ్యాముల నిర్మాణాలు చేపట్టి భూగర్భ జలాల పెంపుకు కృషి చేసిన మహా నేత మంత్రి తుమ్మలన్నారు.
మండలంలో నాగార్జునసాగర్ కాలువ ప్రవహిస్తున్నప్పటికీ, రైతాంగానికి అంతగా ఉపయోగపడని పరిస్థితిని గమని, కాలువపై ఎత్తిపోతల పథకాలను నిర్మించిన ఘన చరిత్ర మంత్రి తుమ్మలకే దక్కుతుందన్నారు. వ్యవసాయం అభివృద్ధి చెందితే వాటిపై ఆధారపడి జీవించే అనేక కుటుంబాలు ఆర్థికాభివృద్ధి చెందుతాయని భావించి, నీటి వనరులకు పెద్దపీట వేయటంతో నేడు మండలంలో రెండు పంటలు పండించుకునే స్థాయికి చేరిందన్నారు.
అంతేకాకుండా గోదావరి జలాలను కరువు నేలకు అందించి, రైతు పక్షపాతిగా, మహా నాయకుడు మంత్రి తుమ్మలని కీర్తించారు. 30 ఏళ్ల క్రితం వ్యవసాయ రంగం, నేటి వ్యవసాయ రంగాన్ని యువకులు గమనిస్తే, వాటి వివరాలు తెలుసు కుంటే, మెతుకు మెతుకు పై తుమ్మల పేరు కనిపిస్తుందని స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి తో వేంసూరు మండలం కోనసీమగా మారుతుందన్నారు. ఇటువంటి గొప్ప నేతను ప్రజలు గుండెల్లో పెట్టుకోవాలని సూచించారు.
