పిల్లల ఆరోగ్యానికి నులిపురుగుల నివారణ మాత్రలు తప్పనిసరి: సర్పంచ్ లావణ్య

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి విద్యార్థికి నులిపురుగుల నివారణ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని సర్పంచ్ మునిగడప లావణ్య అన్నారు.

స్థానిక కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినీ, విద్యార్థులకు నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పిల్లలు ఆరోగ్యవంతంగా ఎదగడానికి నులిపురుగుల నివారణ ఎంతో అవసరమని, ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మండల వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ, మండలంలోని మొత్తం 55 విద్యాసంస్థల్లో 5,426 మంది విద్యార్థులకు 400 మిల్లీగ్రాముల ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేసినట్లు తెలిపారు. పీహెచ్‌సీ సూపర్వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయుల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో కస్తూర్బా విద్యాలయ ప్రిన్సిపాల్ అనితాదేవి, ఉప సర్పంచ్ గోడిశాల రాజు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.