ఆడ.. మగ..వరి అందమైన మడి…

ఆడ.. మగ..వరి అందమైన మడి…
ఆడ మగ వరి వేరు వేరు వరసలో..
మగరకం వరి మొక్క ఎత్తు
ఆడోరకం వరి మొక్క పొట్టిగా
పూత దశలో దుల్పడానికి అధిక కూలీలు
టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో ఎక్కడ చూసినా వరి కనిపిస్తాయి. ఈసారి సాధారణ రకం కాకుండా హైబ్రిడ్ రకం వేయడంతో ఈ సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. కంపెనీలు చేసే సూచనలకు అనుగుణంగానే రైతులు ఈ వరిని పండిస్తారు. పొలంలోని మడిలో ఆడ- మగ రెండు రకం విత్తనాలు వేర్వేరు వరసలో ఉంటాయి. మగ రకం వరి మొక్క ఎత్తుగాను.. ఆడమొక్కలు పొట్టిగాను ఉంటాయి. ఈ రకంలో పండించే విత్తనాలు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంటాయి.
పరపరాగ సంపర్కం…
పూత దశలో ఉన్నప్పుడు మగవరి మొక్కలపై ఉన్న పుప్పొడి రేణువులు ఆడ మొక్కలపై పడే విధంగా దులపాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల పరపరాగ సంపర్కం జరిగి విత్తనాలు మరింత నాణ్యతతో వస్తాయని రైతులు చెబుతున్నారు. రాష్ట్రప్రభుత్వం యాసంగిలో వరి కొనుగోలు చేసేది లేదని చెప్పటం వల్లే ఈ రకం వేశామని రైతులు పేర్కొన్నారు. సాధారణ వరి సాగు కంటే.. విత్తనోత్పత్తి సాగుకు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని చెప్పారు. అయినప్పటికీ మంచి ఫలితాలు ఉంటాయని వెల్లడించారు. ఆయా కంపెనీలే బాధ్యత తీసుకోవడంతో.. వారి సలహాల ప్రకారం సాగు చేస్తున్నారు.

అధికంగా పిచికారీ…
(డ్యాగారి ఓదెలు) భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో వేల ఎకరాల్లో హైబ్రిడ్ వరిని రైతులు సాగు చేస్తున్నారు. అయితే సాధారణ వరితో పోలిస్తే అధికంగా మందులు పిచికారి చేయాల్సి ఉంటుందని తెలిపారు. మొత్తం మూడు దఫాల్లో మందులు చల్లుతామని చెప్పారు. పూత దశలో దులపడానికి అదనంగా కూలీల ఖర్చు ఉంటుందని రైతులు పేర్కొన్నారు.
