శ్రీశైలంలో శాకంభరీ ఉత్సవాలకు సన్నాహాలు..

ఈనెల 29న అమ్మవారికి వైభవంగా ఉత్సవాలు

నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఈనెల 29న శ్రీ భ్రమరాంబ అమ్మవారికి నిర్వహించనున్న శాకంభరీ ఉత్సవాల ఏర్పాట్లపై సోమవారం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, వేదపండితులు, స్థానాచార్యులు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారి, వివిధ శాఖల అధిపతులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ, లోకకల్యాణం కోసం నిర్వహించే ఈ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని, అన్ని కైంకర్యాలు శాస్త్రోక్తంగా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేపట్టాలని వైదిక సిబ్బందికి సూచించారు.

అమ్మవారి అలంకరణకు అవసరమైన వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను సమృద్ధిగా సిద్ధం చేయాలని ఉద్యానవన శాఖను ఆదేశించారు. ఈ విషయంలో వైదిక కమిటీ సూచనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. కనీసం 40 రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో శాకంభరీ అలంకరణ చేపట్టాలని సూచించారు.

భక్తులు సులభంగా దర్శించుకునేలా ఈసారి అమ్మవారి ఉత్సవమూర్తిని అక్కమహాదేవి అలంకార మండపంలో వేంచేపు చేయాలని, మండపాన్ని కూడా ఆకుకూరలు, కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించాలని ఆదేశించారు.

భ్రమరాంబ అమ్మవారితో పాటు ఆలయ ప్రాంగణంలోని రాజరాజేశ్వరి అమ్మవారు, గ్రామదేవత అంకాళమ్మకు కూడా శాకంభరీ అలంకరణతో ప్రత్యేక పూజలు నిర్వహించాలని తెలిపారు. ఆలయ ప్రాంగణం, ప్రధాన ద్వారాలను ఆకుకూరలు, కూరగాయలతో శోభాయమానంగా అలంకరించాలని సూచించారు.

ఉత్సవం సందర్భంగా భక్తులకు అన్ని రకాల కూరగాయలతో తయారుచేసిన కదంబ ప్రసాదాన్ని పంపిణీ చేయాలని, భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం, క్యూ లైన్ల నిర్వహణకు ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈనెల 29న నిర్వహించే శాకంభరీ ఉత్సవం రోజున అమ్మవారి ఆర్జిత కుంకుమార్చనలను పూర్తిగా నిలిపివేయాలని ఆలయ, ఐటీ విభాగాలకు సూచించారు.

అలాగే గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో నిర్వహించే దక్షిణామూర్తి పూజ, వ్యాస పూజ ఏర్పాట్లపై కూడా సమావేశంలో చర్చించారు.