ప్రశాంతంగా కేజీబీవీ ఎక్సలెన్సీ పరీక్షలు..

లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని కేజీబీవీ ఎక్సలెన్సీ కేంద్రంలో ఆదివారం ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఆరవ తరగతి ప్రవేశాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 93 కేజీబీవీలలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి భూక్యా రాజు నాయక్ తెలిపారు.

అందులో భాగంగానే లక్ష్మణచాంద కేజీబీవీ పాఠశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. పరీక్షా కేంద్రంలో మొత్తం 91 మంది విద్యార్థినులు నమోదు చేసుకోగా, 79 మంది హాజరయ్యారని, మిగిలిన 12 మంది గైర్హాజరైనట్లు ఆయన వెల్లడించారు. పరీక్షా కేంద్రాన్ని నిర్మల్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ (ఎగ్జామినేషన్స్) పరమేశ్వర్ పరిశీలించి, పరీక్ష నిర్వహణ తీరును సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక అధికారి నవిత, సిబ్బంది పాల్గొన్నారు.