కాంగ్రెస్ ప్రభుత్వంలో దశాబ్దాల కల సాకారం..
- భువనగిరి -చిట్యాల నాలుగు లైన్ల రహదారికి విస్తరణ పనులకు శ్రీకారం
- మూడు ప్రధాన రహదారులకు రూ 274 .79 కోట్లతో శంకుస్థాపనలు
- భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
వలిగొండ, ఆంధ్రప్రభ : భువనగిరి నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల సాకారమవుతున్న నేపథ్యంలో రూ.274.79 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మూడు ప్రధాన రహదారి అభివృద్ధి పనులకు రామన్నపేటలో ఘనంగా శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమాంతరంగా అమలవుతున్నాయని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రహదారులు, సాగునీరు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రహదారి సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోందని పేర్కొన్నారు.
రూ.274.79 కోట్లతో మూడు ప్రధాన రహదారి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం భువనగిరి నియోజకవర్గ అభివృద్ధిలో కీలక ఘట్టమని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.
ఈ నెల 17న ధర్మారెడ్డి కాలువ ద్వారా వేలాది ఎకరాలకు సాగునీటిని విడుదల చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. రైతులకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక చొరవతో భువనగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొంటూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల అవసరాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే, వలిగొండ–వెలివర్తి–పోచంపల్లి–చౌటుప్పల్ రహదారి, బీబీనగర్–వెంకిర్యాల రహదారి, చిన్నారావుపల్లి–వెంకిర్యాల రహదారి, రేపాక–వీరవెల్లి–యాదాద్రి రహదారుల అభివృద్ధి పనులను కూడా మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు.
శంకుస్థాపన చేసిన పనుల్లో ఎస్. లింగోటం నుంచి జాలుకాలువ వరకు 18.5 కిలోమీటర్ల నాగారం–చౌటుప్పల్ రహదారి అభివృద్ధికి రూ.21.43 కోట్లు, నాగిరెడ్డిపల్లి–టేకులసోమారం–వలిగొండ–రామన్నపేట వరకు 40 కిలోమీటర్ల భువనగిరి–చిట్యాల నాలుగు లైన్ల రహదారి విస్తరణకు రూ.239.75 కోట్లు, నాగిరెడ్డిపల్లి–చందుపట్ల–బండసోమారం వరకు 15.5 కిలోమీటర్ల రాయగిరి–మోత్కూర్ రహదారి అనుసంధాన పనులకు రూ.13.61 కోట్లు కేటాయించారు.
ఈ కార్యక్రమంలో భువనగిరి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల, పట్టణ అధ్యక్షులు, పీఏసీఎస్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
