దమ్మపేట రెవెన్యూలో అవినీతి
1/70యాక్ట్ లో గిరిజనేతరులకు భూ బదలాయింపు
మనిషి బ్రతికుండగానే డెత్ సర్టిఫికెట్
సంబంధం లేని వారితో ఫ్యామిలీ సర్టిఫికెట్
అన్ని ఫోర్జరీ సంతకాలేనన్న తహసీల్దార్
దమ్మపేట, ఆంధ్రప్రభ : దమ్మపేట మండల రెవెన్యూ కార్యాలయంలో మరో అవినీతి చోటుచేసుకుంది. జిల్లాలో అత్యంత అవినీతి కార్యాలయంగా ముద్రపడిన దమ్మపేట రెవెన్యూ కార్యాలయం నుండి తాజాగా మరో 1/70 యాక్ట్ అమలులోనున్న పంచాయతీ పరిధిలో గిరిజనేతరులకు అక్రమ భూ బదలాయింపు జరిగినట్టు తెలుస్తుంది. తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం, ఫ్యామిలీ సర్టిఫికెట్ తో 5ఎకరాల అసైన్డ్ భూమి పాస్ బుక్ బదలాయింపు వ్యవహారం ఇప్పుడు మండలంలో సంచలనం రేకెత్తింది.
వివరాలలోకి వెళితే.. దమ్మపేట మండల పరిధిలోని పెద్దగొల్లగూడెం రెవెన్యూ మౌజా 385/54లో అదే గ్రామానికి చెందిన మళ్ళా సత్యం అనే రైతుకు 5ఎకరాల అసైన్డ్ భూమి ఉండగా అతని పేరుతోనే 2018లో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం చిన్న పాస్ బుక్ జారీ చేసింది. ఈ క్రమంలో అదే భూమిని దమ్మపేట మండలం మందలపల్లి గ్రామానికి చెందిన గిరిజనేతరురాలు నామ పుష్పవతి భర్త సత్యనారాయణకు పేరుకు బదలాయింపు చేశారు. ఈ అక్రమ భూ బదలాయింపునకు వీలుగా బ్రతికున్న మళ్ళా సత్యం 2018 లోనే పెద్దగొల్లగూడెం గ్రామ పంచాయతీలో క్ర.సం 2018/28 ప్రకారం ది.29/06/2018 న చనిపోయినట్టు మరణ ధ్రువీకరణ పత్రాన్ని సైతం సిద్ధం చేశారు. రైతు మళ్ళా సత్యంకు నలుగురు కుమార్తెలు ఓ కుమారుడు సైతం ఉండగా కుటుంబ సభ్యులు సైతం ఎవ్వరరూ లేరని భార్య పుల్లమ్మ మరణించిందని సత్యంకు గల ఏకైక వారసురాలుగా రైతు మళ్ళా సత్యంకు ఎలాంటి సంబంధం లేని గిరిజనేతరురాలు నామ పుష్పావతినే అంటూ ఫ్యామిలీ సర్టిఫికెట్ ను పుట్టించారు . తప్పుడు ధ్రువపత్రాలు ఆధారంగా ది 26/05/2026 న ఖాతా నంబర్ 60527 ద్వారా దర్జాగా 5ఎకరాల అసైన్డ్ భూమిని నామ పుష్పవతి భర్త సత్యనారాయణ కు కట్టబెట్టారు. ఈ భూ బదలాయింపు వ్యవహారం అంతా పెద్దగొల్లగూడెం గ్రామ జీపీఓ అనంతలక్ష్మి కీలకంగా వ్యవహరించినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.
నేను బ్రతికే ఉన్నాను
మళ్ళా సత్యం
బాధితుడు మళ్ళా సత్యం మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న” సర్ ” సర్వేలో తన ఓటుకు సంబంధించి గణన ఫారం అధికారులు ఇవ్వకపోవటంతో అనుమానం వచ్చి అధికారులను నిలదీయగా తాను 2018 లోనే చనిపోయినట్టు తెలిపారని అన్నాడు. 73 ఏళ్ల వయసులో పింఛను మీదనే బ్రతికే తాను బ్రతికున్నట్టు ఎలా నిరూపించుకోవాలని, ఈ మరణ ధ్రువీకరణపత్రం కారణంగా పింఛను, రేషన్ తో పాటు ప్రభుత్వ పథకాలను ఓటును సైతం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులకు జీతాలు సరిపోవన్నట్టు లంచాలు తీసుకుంటూ పేద ప్రజలను బతికుండగానే చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

నా సంతకం ఫోర్జరీ జరిగింది : తహసీల్దార్
భూమి బదలాయింపు విషయమై స్థానిక తహసీల్దార్ రామ్ నరేష్ ను వివరణ కోరగా పాస్ బుక్ జారీ వ్యవహారంలో రైతు నుండి ఫిర్యాదు రాగానే తప్పు దొరిలినట్టు తాను గుర్తించినట్లు , స్థానిక జీపీఓ అనంతలక్ష్మి తప్పుడు వివరాలు అందించడంతోనే పొరపాటు జరిగినట్లు గుర్తించామన్నారు. ఈ వ్యవహారం మొత్తంలో తప్పుడు వివరాలతో పాటు తన సంతకం కూడా జీపీఓ అనంతలక్ష్మి ఫోర్జరీకి పాల్పడినట్లు తన ప్రాథమిక విచారణలో తేలిందని రామ్ నరేష్ తెలిపారు . ఇదే విషయమై ఇప్పటికే జిల్లా కలెక్టర్ ను సమయం కోరి పూర్తి నివేదిక అందించటంతోపాటు ఫోర్జరికి పాల్పడిన జీపీఓ అనంతలక్ష్మిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
