Ravan Case | రావణ్ కస్టడీపై 14న విచారణ

10 రోజుల పోలీసు కస్టడీ కోరుతూ గన్నవరం పోలీసుల పిటిషన్
ఈ నెల 14న ఇరుపక్షాల వాదనలు విననున్న న్యాయస్థానం

Ravan Case | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : కృష్ణా జిల్లాకు చెందిన యూట్యూబర్ రావణ్ పోలీసు కస్టడీ పిటిషన్‌పై విచారణను గన్నవరం కోర్టు ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. రావణ్‌ను 10 రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించాలంటూ గన్నవరం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించేందుకు మరింత సమయం కోరడంతో, కోర్టు పిటిషన్ విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. ఆ రోజు ప్రభుత్వం, ప్రతివాది తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు.

ఇదిలా ఉండగా, రావణ్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాక‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరును విమర్శించారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. రావణ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే ఒక సామాన్యుడిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూపీఏ) కింద కేసు నమోదు చేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు.