Sekhar Kammula |శేఖర్ కమ్ముల ఫోకస్ నెక్స్ట్ మూవీపైనే..
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, ఫిదా, లవ్ స్టోరీ, కుబేర వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మిగతా దర్శకుల్లా కాకుండా, ఈయన సినిమాలు ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటాయి. ఎంతటి సున్నితమైన అంశాన్ని అయినా కేవలం మాటలతో కాకుండా, తనదైన మార్క్ మేకింగ్‌తో ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా తెరకెక్కిస్తుంటారు.
దర్శకుడు శేఖర్ కమ్ముల ‘కుబేర’ చిత్రం తర్వాత తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెట్టినట్లు సినీ వర్గాల్లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. తన తరువాతి సినిమాను కూడా ‘కుబేర’ చిత్ర నిర్మాత ఏషియన్ సునీల్ నిర్మాణంలోనే రూపొందించనున్నట్లు ఇప్పటికే శేఖర్ కమ్ముల ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన కథను ఆయన ఇప్పటికే పూర్తి చేయగా, ప్రస్తుతం హీరో వెతుకులాటలో ఉన్నట్లు సమాచారం.
ఇందుకోసం ఇప్పటికే పలువురు హీరోలతో చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో అక్కినేని నాగచైతన్య పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, ప్రస్తుతం నాగచైతన్య పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉండటంతో ఆయన డేట్స్ సర్దుబాటు కావడం లేదని టాక్.
ఒకవేళ హీరో ఎంపిక గనుక త్వరలోనే పూర్తయితే, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రారంభంలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లేలా నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
హీరో ఎంపికపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. దర్శకుడు, కథ, నిర్మాత అంతా సిద్ధంగా ఉన్నారు.. ఇక హీరో ఓకే అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కావడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది చివర్లోనే శేఖర్ కమ్ముల కొత్త సినిమాను ప్రేక్షకులు వెండితెరపై చూసే అవకాశం లభిస్తుంది.
