బాలరాముడి ఆలయంలో వెలుగుచూసిన అవకతవకలు

బాలరాముడి ఆలయంలో వెలుగుచూసిన అవకతవకలు

సిట్ దర్యాప్తు, అరెస్టులు, ట్రస్ట్‌లో పరిణామాలు

ఆలయ వ్యవస్థలో అవినీతి ప్రభావం, భక్తుల విశ్వాసం

అయోధ్య అంశం చుట్టూ రాజకీయ విమర్శలు, ఎన్నికల ప్రభావం

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయోధ్య బాలరాముడి ఆలయంలో జరిగిన అవినీతి దేశాన్ని కుదిపేస్తోంది. ఆలయ వ్యవస్థను అప్రతిష్ఠ పాలు చేయడంతో పాటు భక్తుల విశ్వాసాలను గాయపరిచే ఇలాంటి చర్యలు ఖండనీయమే కాదు, శిక్షార్హం కూడా. ప్రపంచ వ్యాప్తంగా రామభక్తుల మనసు నొప్పించిన ఘటన ఇది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ సభ్యుడు కృష్ణ మోహన్‌ ఇచ్చిన ఫిర్యాదుకు ముందే యూపీ ప్రభుత్వం ఆగమేఘాల మీద విచారణకు ఆదేశించింది. జూన్‌ 25న ఫిర్యాదు నమోదైంది. కానీ, యూపీ ప్రభుత్వం జూన్‌ 14వ తేదీన స్పెషల్‌ ఇన్వెష్టిగేషన్‌ టీంను ఏర్పాటు చేసింది. సిట్‌ దర్యాప్తులో బయటపడిన వాస్తవాల ఆధారంగా ఎనిమిది మందిని ఇప్పటికే అరెస్టు చేసింది. ప్రాథమిక నివేదికను ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వానికి సమర్పించింది. ముఖ్యమంత్రి యోగి అదిత్యానాథ్‌ ‘అయోధ్య అవినీతి‘ కేసును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు తెలుస్తోంది.

రమారమి రూ.80లక్షల నగదును ‘సిట్‌’ స్వాధీనం చేసుకుంది. ఇంకా విచారణ కొనసాగుతోంది. అవినీతికి నైతిక బాధ్యత వహిస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ సహా ట్రస్ట్‌ సభ్యుడు అనిల్‌ మిశ్రా ఇప్పటికే రాజీనామా చేశారు. చంపత్‌ రాయ్‌ మాజీ డ్రైవర్‌ రామ్‌ శంకర్‌ యాదవ్‌ అవినీతి వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడని ‘సిట్‌’ తేల్చిన నేపథ్యంలో ‘రాయ్‌’ తమ పదవి నుంచి తప్పుకున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్‌, 27 నుంచి జూన్‌ 5 మధ్య 40 రోజుల వ్యవధిలో 70 సార్లు చోరీ జరిగినట్టు ‘సిట్‌’ గుర్తించింది. మొత్తం రూ.7 కోట్లకు పైగా ధన, వస్తు, వాహన కానుకలు మాయమైనట్టు ‘సిట్‌’ బృందం తేల్చింది. మరోవైపు ఉత్తర భారత బులియన్‌ అండ్‌ జువెలర్స్‌ అసోషియేషన్‌ 2020లో అయోధ్య భూమి పూజకు ముందు విరాళంగా ఇచ్చిన 39.26 కిలో వెండి సహా 4.62 కిలోల వెండి ఇటుకలు, 1.65 కిలోల వెండి కలశం ఉన్నాయో లేదో తెలియని అయోమయ స్థితి నెలకొందంటూ అసోషియేషన్‌ కార్యదర్శి అనురాగ్‌ రస్తోగి అనుమానం వ్యక్తం చేశారు. అనేక భూరి విరాళాల తాలూకు సమాచారాన్ని తేల్చే పనిలో ‘సిట్‌’ బృందం నిమగ్నమై ఉంది.

అయోధ్య రామాలయమే కాదు, దేశంలోని ఏ ఆలయంలో అవకతవకలు, అవినీతి జరిగినా అది మన ధార్మిక ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది. ఆలయ వ్యవస్థపై భక్తకోటికి ఉన్న విశ్వాసాలను గాయపరుస్తుంది. ఉత్తర, దక్షిణ భారతంలోని అనేక ప్రాచీన ఆలయాల్లో అవకతవకలు జరుగుతున్నాయనేది నిష్ఠుర సత్యం. భారత దేశ మనుగడకు మూలం ఆలయం. మనిషి స్థాణువుగా మారినప్పుడు, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు మనని తట్టిలేపే అఖండ శక్తి దేవాలయం. అలాంటి చోట అవినీతిని సహించడం నైతిక పతనం అవుతుంది.

అయోధ్య రామాలయంలో కానుకల అవకతవకల వ్యవహారం బయటకు రాగానే నాస్తికులు, హేతువాదులంతా రామభక్తుల అవతారమెత్తారు. అయ్యో రామా అంటూ ఆర్తనాదాలు వినిపించడం మొదలుపెట్టారు. కోదండపాణి సన్నిధిలో కాసుల కక్కుర్తి ఏల అని దిగ్భ్రమ చెందినట్టూ నటనా కౌశలాన్ని ప్రదర్శించనారంభించారు. రామజన్మ భూమిలో కానుకల అవకతవకలను ఎంత తీవ్రంగా ఖండిస్తామో.. సందట్లో సడేమియాలా ఇతరేతర ప్రయోజనాల కోసం ‘అయోధ్య’ అంశాన్ని తలకెతుకునేవారి రంగునూ బయటపెట్టాలి.

ఉత్తర, దక్షిణ భారత దేశాల్లోని అనేక ఆలయాల్లో అవినీతి రాజ్యమేలుతోందనేది బహిరంగ రహస్యం. సంపద పోగుపడిన చోట, అవకాశవాద శక్తులు ఏకమయ్యే చోట అవినీతి సహజంగానే పెచ్చుమీరుతుంది. దేశం, ధర్మం, దైవం వంటి నైతిక విలువలు, ఆధ్యాత్మికత అన్నీ అంతర్ధానమైపోయి…కేవలం చోరకళ మాత్రమే నిటారుగా నిలబడుతుంది. దేశంలో తొంభయ్యో దశకం తర్వాత ఆలయ వ్యవస్థలోకి క్రమంగా అవినీతి ప్రవేశించింది. ఆలయ భూములను అన్యాక్రాంతం చేసుకోవడంతో మొదలై, దేవాలయ ఆదాయం పెరుగుతున్నప్పుడల్లా…మౌలిక సౌకర్యాల కల్పన, ఆలయ విస్తరణ పేరిట రకరకాల మార్గాల్లో ఆర్థిక అవకతవకలు మొదలయ్యాయి. ప్రసాద వితరణ, పంపిణీలో సైతం చేతివాటం ప్రదర్శించి కోట్లు కొల్లగొట్టినవాళ్ల చిట్టా చాంతాడంత ఉంది. దీన్నెవరూ కాదనలేరు. అభిప్రాయాలు, వైఖరులు ప్రకటించడం వైయక్తిక వ్యవహారం. కానీ, సత్యదూరమైన ఆరోపణలు చేయడం నైతికతకు తిలోదకాలు ఇచ్చినట్టే అవుతుంది.

ఆయోధ్య బాల రాముడి సన్నిధిలో కానుకల అవకతవకలు జరిగాయనే వార్త బయటకు రాగానేనే యూపీలోని ప్రతిపక్ష పార్టీల నుంచి దేశంలోని అనేక పార్టీలు రామనామ జపం చేయడం మొదలుపెట్టాయి. ఒకరు 7 వందల కోట్ల కుంభకోణం అంటే మరోకరు 2 వందల కోట్ల కుంభకోణం అంటూ ఆరోపణలు సంధించడం మొదలుపెట్టారు. జూన్‌ 6న ఒక పద్ధతి ప్రకారం ఈ అవతవకల వ్యవహారాన్ని మీడియాలో, సోషల్‌ మీడియాలోకి తెచ్చారు. ఉత్తరప్రదేశ్‌ శాసన సభ ఎన్నికలకు 7 నెలల వ్యవధి ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌ నుంచే ఎన్నికల వాతావరణం మొదలవుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలకు ఎన్నికలను ఎదుర్కొనే బలమైన నెరేటివ్‌ లేదు. యోగిని ఎదుర్కోవడానికి అవసరమైన, బలమైన ఒక అంశం ఏదీ దొరకడం లేదు.

మే 20వ తేదీన ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలపై కొన్ని ఛానళ్లు, పత్రికలు ఒపీనియన్‌ పోల్‌ నిర్వహించాయి. 257 స్థానాలతో బీజేపీ మళ్లీ విజయం సాధిస్తుందనీ, యోగి అదిత్యానాథ్‌ మళ్లీ ముఖ్యమంత్రి కానున్నారని తేల్చాయి. దీంతో రాజకీయ పార్టీలకు భయం పుట్టుకుంది. దేశంలో యూపీ ఎన్నికలు అత్యంత కీలకమైనవి. 2029 సార్వత్రిక ఎన్నికల్లో యూపీ అసెంబ్లీ ఫలితాలు నిర్ణాయక పాత్ర పోషిస్తాయి. జూన్‌లో నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌లో సైతం యోగీ అదిత్యానాథ్‌ వైపే మొగ్గు చూపారు.

ఒపీనియన్‌ పోల్‌ ప్రామాణికం కాకపోవచ్చు కానీ, రాజకీయ పార్టీలకు ప్రతి అంశం ప్రామాణికమే అవుతుంది. అధికారంలో లేనివారికి ప్రతి అంశం భయం కలిగిస్తుంది. కొన్ని స్థానాల సంఖ్య అటు ఇటూ అయినా…యోగి హ్యాట్రిక్‌ సాధించడం ఖాయమని వార్తా సంస్థలు తేల్చాయి. ఇదే సమయంలో అయోధ్య ఆలయ అవకతవకల వ్యవహారం వెలుగు చూసింది. జరిగిన అవినీతిని ఎవరూ సమర్థించనక్కరలేదు కానీ, గతంలో అయోధ్య ఆలయ నిర్మాణంపై విషం కక్కినవారికి ఇప్పుడెందుకు రామభక్తి పూనకాలు వస్తున్నాయనేది అసలు ప్రశ్న.

అయోధ్య రామాలయ అవకతవకల వ్యవహారం కేవలం ఆర్థిక అవినీతి కాదని, కోట్ల మంది రామభక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశమని యూపీ ముఖ్యమంత్రి యోగి అదిత్యానాథ్‌ స్వయంగా ప్రకటించారు. సిట్‌ అరెస్టుల పర్వం కొనసాగిస్తోంది. అక్రమ సంపాదనను స్వాధీనం చేసుకుంటోంది. యూపీ ప్రతిపక్షాలు సహా దేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఆరోపించినట్టు ఇది భారీ స్థాయిలో, కీలక వ్యక్తులు చేసిన అవినీతి కాదని ఇప్పటి వరకూ జరిగిన ‘సిట్‌’ విచారణలో తేలింది. ఆలయ పాలన వ్యవహారాలపై పట్టులేకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది ఇష్టారీతిన చేతివాటం ప్రదర్శించారని అర్థమవుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం గోరంతను కొండంత చేయడం వల్ల తాత్కాలిక ప్రయోజనం కలుగుతుందేమో కానీ, దీర్ఘకాలంలో సత్యం ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షమవుతుంది.

– వీరప్ప వనకల్ల