భక్తిశ్రద్ధల మధ్య బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవం

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్‌నగర్ రూరల్ (ఆంధ్రప్రభ): మండల పరిధిలోని అడవి వెంకటాపురం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవం గురువారం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జే. నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గ్రామదేవతలు, కులదేవతల ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖశాంతులు, ఐశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామ అభివృద్ధి, ప్రజల ఐక్యత, సాంప్రదాయాల పరిరక్షణలో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని, ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

శివ–ఆంజనేయ, స్వయంభూ వినాయక స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

అనంతరం గ్రామంలోని శివ–ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే హనుమాన్ గుట్టపై వెలసిన స్వయంభూ వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, నాయకులు వెంకటాపురం శ్రీనివాస్ యాదవ్, ఉపసర్పంచ్ గోపాల్, సుధాకర్ రెడ్డి, మన్యంకొండ దేవస్థానం కమిటీ సభ్యులు అలివేల, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.