విద్యార్థులను అలరించిన కూచిపూడి నృత్య వర్క్‌షాప్

లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ: మండలంలోని వడ్యాల్ ఉన్నత పాఠశాలలో బుధవారం స్పిక్ మాకాయ్ ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య వర్క్‌షాప్, ప్రదర్శన నిర్వహించారు. ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి సాత్విక రెడ్డి విద్యార్థులకు శిక్షణతో పాటు ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా సాత్విక రెడ్డి కూచిపూడి నృత్య కళ చరిత్ర, ఆవిర్భావం, సంప్రదాయం, విశిష్టతను విద్యార్థులకు వివరించారు. నృత్యంలోని హస్తముద్రలు, అడుగులు, భావ వ్యక్తీకరణ, అభినయాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

భారతీయ సాంప్రదాయ కళలను పరిరక్షించాల్సిన అవసరాన్ని విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ఆసక్తిగా కార్యక్రమాన్ని వీక్షించి, కళాకారిణితో ముచ్చటిస్తూ తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్పిక్ మాకాయ్ కోఆర్డినేటర్ వశిష్ట, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు