20 ఏళ్ల కల సాకారం

-విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ మోహన్

తాడ్వాయి, ఆంధ్రప్రభ: తాడ్వాయి మండలం చిట్యాల గ్రామ ప్రజలు రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం కల ఎట్టకేలకు సాకారమైంది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రూ.2.11 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. గత సంవత్సరం చిట్యాల, సోమారం, సంతయిపేట్ గ్రామాలకు సంబంధించి చిట్యాల లో ఈ ఉపకేంద్రానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ శంకుస్థాపన చేయగా, అధికారులతో సమన్వయం చేస్తూ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించారు.

ఏడాది వ్యవధిలోనే ప్రాజెక్టును పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో చిట్యాల ప్రజల్లో ఆయనపై మరింత విశ్వాసం పెరిగింది.ఈ సందర్భంగా చిట్యాల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మ్యాడం బాలయ్య మాట్లాడుతూ, మాటిచ్చాడంటే నిలబెట్టుకుంటాడు అనే నమ్మకానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మరోసారి నిదర్శనంగా నిలిచారని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించి గ్రామ అభివృద్ధికి కొత్త దిశను చూపారని కొనియాడారు.

ఈ 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం అందుబాటులోకి రావడంతో చిట్యాల, సంతాయిపేట్ ,సోమారం మరియు అన్నారం తండా గ్రామాలకు దీర్ఘకాలంగా ఉన్న లో వోల్టేజ్ విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. దీంతో వ్యవసాయానికి, గృహ వినియోగానికి, చిన్న వ్యాపారాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందే అవకాశం ఏర్పడింది. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషికి ఈ విద్యుత్ ఉపకేంద్రం మరో మైలురాయిగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ జక్కుల రాజిరెడ్డి, సర్పంచ్ రంజిత్ రెడ్డి,మండల అధ్యక్షుడు సంజీవులు, ఉపాధ్యక్షులు మెట్టు చంద్రం, నరసింమా రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ గైని శివాజీ, షౌకత్, రాజీవ్,స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.