Jaipur | రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం..

Jaipur | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఓ కూతురు కన్నతల్లినే హత్య చేయించిన ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండ్రి మరణం తర్వాత తల్లి సీరత్ శర్మకు క్లర్క్ ఉద్యోగం రావడంతో పాటు ఆస్తి కూడా ఆమె పేరుపై ఉండేది. ఈ ఉద్యోగం, ఆస్తి తనకే కావాలని కూతురు ఆయుషి తరచూ తల్లితో గొడవపడేది.

తల్లి అందుకు అంగీకరించకపోవడంతో ఆయుషి తన బంధువులతో కలిసి హత్యకు పథకం వేసింది. ఈ నెల 2న కారుతో కావాలనే ఢీకొట్టించి సీరత్ శర్మను హత్య చేశారు. అనంతరం దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.

అయితే ఘటనపై అనుమానం వచ్చిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కూతురు ఆయుషితో పాటు హత్యకు సహకరించిన ఆరుగురు బంధువులను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.