ఓటీపీలు చెప్పొద్దు.. ఫోన్ స్కామ్‌లపై అప్రమత్తంగా ఉండాలి
సీపీ సాయి చైతన్య
వర్ని, ఆంధ్రప్రభ: ఫోన్‌ల ద్వారా జరిగే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు (OTP) చెప్పడం వల్ల బ్యాంకు ఖాతాల్లోని డబ్బు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
‘మన ఊరు.. మన భద్రత.. మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా బుధవారం శ్రీనగర్ జాకోరా గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సీపీ ప్రారంభించారు. బాలవికాస సహకారంతో రూ.3 లక్షల వ్యయంతో, మాదాల చారిటబుల్ ట్రస్ట్, సమాజ వికాస కేంద్రం ఆధ్వర్యంలో రూ.2 లక్షల వ్యయంతో గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, ఓటీపీ ఆధారంగా జరిగే సైబర్ నేరాల్లో పోయిన డబ్బును తిరిగి రాబట్టడం కష్టతరమవుతుందని తెలిపారు. సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో నేరాల నియంత్రణ, దొంగతనాల ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, సంఘటనలపై సమాచారం త్వరగా తెలుసుకునేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని, వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని గ్రామస్తులకు సూచించారు.
యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా చూడాలని, గంజాయి విక్రయాలు లేదా వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాకోరా సర్పంచ్ సాయిలు, శ్రీనగర్ సర్పంచ్ పూర్ణిమ కిరణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రుద్రూర్ సీఐ కృష్ణ, ట్రస్ట్ సభ్యులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
