Pattisema-Lift-Starts : కృష్ణా డెల్టాకు ఉపిరి Andhra Prabha Top News
Pattisema-Lift-Starts : కృష్ణా డెల్టాకు ఉపిరి Andhra Prabha Top News
- పట్టిసీమ ఒట్టిసీమ అన్న జగన్ ఏం సమాధానం చెబుతారు?
- చంద్రబాబు విజన్ కు నిదర్శనం పట్టిసీమ.
- సూపర్ ఎల్ నినో ను సమర్దంగా ఎదుర్కొంటాం.
- పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల ద్వారా నీటి విడుదల.
- జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.
( ఆంధ్రప్రభ; ఏలూరు బ్యూరో )

పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపు గోదావరి వృధా జలాలను, కృష్ణ డెల్టాకు తరలించాలన్న ఉన్నతాశయంతో ఏర్పాటు చేసిన పట్టిసీమ ఎత్తిపోతల సత్ఫలితాలు ఇచ్చిందని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. కేవలం 1300 కోట్ల రూపాయలు వ్యయంతో ఏర్పాటుచేసిన పట్టిసీమ వల్ల వేల కోట్ల రూపాయల పంట పండిందన్నారు. బుధవారం ఉదయం ఏలూరు జిల్లా లో పట్టిసీమ, తూర్పు గోదావరి జిల్లా లో తాడిపూడి ఎత్తిపోతల పథకాలకు మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేశారు.

పట్టిసీమ డెలివరీ పాయింట్, తాడిపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు దగ్గర గోదావరికి జలహారతి ఇచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు, పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను, కృష్ణాజలాలతో అనుసంధానం చేసి, నదుల అనుసంధానానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. నాడు పట్టిసీమ ఒట్టిసీమ అన్న జగన్, ఇప్పుడు ఏముఖం పెట్టుకుని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇప్పటివరకు పట్టిసీమ ద్వారా 442 కు పైగా టీఎంసీ లను కృష్ణా డెల్టాకు తరలించాం. 50వేల కోట్ల ఆదాయాన్ని సృష్టించామని ఆయన అన్నారు. దూరదృష్టి, ముందుచూపు, నిర్మాణాత్మక ఆలోచన కలిగిన నాయకుడు ఉంటే ప్రజలకు ఏవిధంగా మేలు జరుగుతుందో పట్టిసీమే ఉదాహరణ అని మంత్రి పేర్కొన్నారు. పాలన అనుభవం లేకపోవడం, విధ్వంసపు ఆలోచనలు వల్లే జగన్ తన పాలనా కాలంలో పట్టిసీమ వైపు కన్నెత్తి చూడలేదని విమర్శించారు. గోదావరి కి ఎగువ నుండి వస్తున్న నీటిని, సముద్రంలోకి పోకుండా, ఒడిసిపట్టుకుని కృష్ణా డెల్టాకు తరలించటం గొప్ప విషయం అన్నారు. ఆల్మట్టి నుండి జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్ వరకు ఖాళీ జలాశయాలతో ఉన్న కృష్ణా కు ఈ పట్టిసీమ నేడు ఉపిరి పోస్తుందన్నారు.
Pattisema-Lift-Starts : ఎల్ నినోను ఎదుర్కొందాం.

చంద్రబాబు సూచనలతో సూపర్ ఎల్ నినోను సమర్దంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి రామానాయుడు చెప్పారు. ముందస్తు ప్రణాళికలతో ప్రతి నీటి బొట్టునూ సమర్దంగా వినియోగించుకుంటున్నామన్నారు. ఎల్ ని నో, సూపర్ ఎల్ నినో ల గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చెందుతున్న ప్రస్తుత తరుణంలో మన రాష్ట్రంలో ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి కూటమి ప్రభుత్వం అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుందన్నారు.

ఎల్ ని నో లేని రోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు జలధార జల హారతి 100 రోజుల కార్యక్రమం చేపట్టారన్నారు. అతివృష్టి, అనావృష్టి ప్రాంతాలలో డ్రైన్లు, కాలువలు ఏర్పాటు చేసి వీటిని సమీప చెరువులకు అనుసంధానించడం ద్వారా ప్రతి నీటి బొట్టు ఒడిచి పట్టవచ్చు అన్నారు. జల ధార-జల హారతి కార్యక్రమంలో ఇప్పటికి 98 రోజులు పూర్తయ్యాయి అన్నారు.. ఈ పనులన్నీ సత్ఫలితాలు ఇవ్వబోతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూమినే జలాశయంగా మార్చుకుని భూగర్భ జల సంపదను వృద్ధి చేయడమే అని ఆయన వివరించారు. భూగర్భ జల సంపద మట్టం ఒక మీటరు పెరిగితే 99 టీఎంసీల నీరు లభ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారని అన్నారు. అలాగే సమర్థ నీటి యాజమాన్యం వల్ల నీటి పొదుపును పాటించవచ్చు అన్నారు. ఉదాహరణకు మన కృష్ణానదిని తీసుకుంటే జూరాల, ఆల్మట్టి, శ్రీశైలం నాగార్జునసాగర్ రిజర్వాయర్లో నీళ్లు లేవు. మన పులిచింతలలో మాత్రం ఈరోజు కూడా 28 టీఎంసీలు నీరు ఉంచుకోగలిగాం అని మంత్రి వివరించారు.
70 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే జూలై 5వ తేదీ కూడా గోదావరికి ఇన్ఫ్లోలు లేకపోవడం ఇది మొదటిసారి అని మన ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. నిన్న 56,000 క్యూసెక్కులు నీరు వచ్చిందని ఈ నీటిలో 8,000 క్యూసెక్కులను ప్రతిరోజు పట్టిసీమ ద్వారా కృష్ణ డెల్టాకు పంపుతామన్నారు.
Pattisema-Lift-Starts : ఇక అత్యవసరానికే ప్రాధాన్యం

ప్రాధాన్య క్రమంలో అత్యవసరాల ప్రాతిపదికన నీటిని పొదుపుగా వాడుకుందామన్నారు. ఎల్ నినోని సమర్థంగా ఎదుర్కొందామన్నారు. ప్రతినిత్యం, ప్రతి ఎకరాకు, ప్రతి రైతుకి నీ అందించాలని ఆలోచించే చంద్రబాబు ఉండటం మన దృష్టంగా రామానాయుడు అభివర్ణించారు. అలాగే ప్రభుత్వంతో పాటు ఎల్ నినో ప్రభావాన్ని తట్టుకునేందుకు ముఖ్యంగా రైతు సోదరులు కూడా పూర్తిగా సహకరించాలని రామానాయుడు విజ్ఞప్తి చేశారు. ఆరుతడి పంటలకు అవకాశం ఉన్నచోటల్లా, ఆ పంటలు వేసి నీటి పొదుపును పాటించాలన్నారు. అలాగే ముందు తాగునీటికి, ఆ తరువాతనే సాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.
