ఈనెల 13న సీఎం పోలవరం పర్యటనకు ఏర్పాట్లు

పనుల పురోగతిపై అధికారులతో కలెక్టర్ సమీక్ష
ప్రతి ప్రాంతంలో ఇంజనీరింగ్ అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశం

పోలవరం/ఏలూరు, ఆంధ్రప్రభ: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 13న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు పర్యటించే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి బుధవారం అధికారులతో కలిసి ప్రాజెక్టు ప్రాంతంలో ఏర్పాట్లను పరిశీలించారు.

ముందుగా హెలిప్యాడ్ ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్, అనంతరం ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్, పవర్ హౌస్, యూనిట్ టర్బైన్ తదితర నిర్మాణ ప్రాంతాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో పనుల పురోగతిని వివరించేందుకు ఏర్పాటు చేయనున్న ఎగ్జిబిషన్ ఏర్పాట్లపై ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ముఖ్యమంత్రి పరిశీలించే ప్రతి ప్రాంతంలో పనుల పురోగతిని స్పష్టంగా వివరించేందుకు ఇంజనీరింగ్ అధికారులను నియమించాలని కలెక్టర్ ఆదేశించారు. సందర్శనకు వచ్చే ప్రతినిధులకు ప్రాజెక్టు పురోగతిపై పూర్తి సమాచారం అందేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఈ పరిశీలనలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, ఆర్డీవో ఎం.వి. రమణ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఇంజనీర్ రమేష్ కుమార్, ఎస్‌ఈ కె. రామచంద్రరావు, ఈఈలు డి. శ్రీనివాసు, పి.వి. వెంకటరమణ, డీఈ మాధవరావు, ఇంజనీరింగ్ అధికారులు, తహసీల్దార్ జోజి, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.