మహనీయుడు వైఎస్సార్ ఆశయ సాధనకు కృషి చేయాలి

వేములవాడ, (ఆంధ్రప్రభ): మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పేదల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానేతగా వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచారని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్సార్ 77వ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ వేములవాడ ప్రాంతంతో వైఎస్సార్‌కు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ప్రజా పథం ద్వారా ఎత్తిపోతల పథకాలు, సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేయడంతో పాటు రైతులకు ఉచిత విద్యుత్, కొనుగోలు కేంద్రాలు, పేదల సంక్షేమానికి ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. ప్రజా ప్రభుత్వంలో పెండింగ్ ప్రాజెక్టుల పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తూము మధు, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, కాంగ్రెస్ నాయకులు, వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు.