సెంట్రల్‌లో పేదల సొంతింటి కలకు శ్రీకారం..

బీఎల్‌సీ గృహ నిర్మాణ పథకం అమలు క
తొలి విడతగా 112 మందికి రూ.1.20 కోట్లు జమ…
త్వరలో మరో 172 మంది ఖాతాల్లోనూ ఆర్థిక సాయం
అర్హులైన ప్రతి కుటుంబం పథకాన్ని వినియోగించుకోవాలి..
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పారదర్శకంగా అమలు.
సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు

పాయికాపురం, ఆంధ్రప్రభ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ (బీఎల్‌సీ) గృహ నిర్మాణ పథకం ద్వారా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసేందుకు చర్యలు వేగవంతమయ్యాయి. తొలి విడతలో 112 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.1.20 కోట్ల ఆర్థిక సాయాన్ని నేరుగా జమ చేసినట్లు ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. త్వరలో మరో 172 మంది అర్హులైన లబ్ధిదారులకు కూడా ఇదే పథకం కింద నిధులు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

సింగ్‌నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బొండా ఉమా మాట్లాడుతూ, సొంత స్థలం ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు నిర్మించుకోలేని పేద కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరమని చెప్పారు. ప్రభుత్వం అందించే నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావడం వల్ల మధ్యవర్తులకు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకతతో అమలు జరుగుతోందన్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1 లక్ష కలిపి ప్రతి అర్హ కుటుంబానికి మొత్తం రూ.2.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తోందని తెలిపారు. ఈ నిధులను ఇంటి నిర్మాణానికి వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.

సెంట్రల్ నియోజకవర్గంలో సొంత స్థలం ఉండి ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని అర్హులైన కుటుంబాలు ఎమ్మెల్యే కార్యాలయం లేదా ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ సంస్థ కార్యాలయాన్ని సంప్రదించి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఈ పథకానికి గడువు లేదని, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు ఇంటి నిర్మాణాన్ని ప్రారంభిస్తే సరిపోతుందని వివరించారు. పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ఒక్క కుటుంబం కూడా ఈ పథకానికి దూరం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రతి సంక్షేమ పథకం అర్హులైన వారికి చేరేలా ప్రజాప్రతినిధిగా నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో ఏఈ ఎం.డి. ఇర్ఫాన్, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.