ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను విజయవంతం చేయాలి
హనుమకొండ, (ఆంధ్రప్రభ): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధుల సహకారంతో విజయవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలో ఇప్పటివరకు 98.96 శాతం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తైందని, 25.79 శాతం ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఫారాలు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో వాటి స్వీకరణలో రాజకీయ పార్టీల బీఎల్‌ఏలు సహకరించాలని సూచించారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
జూలై 24న పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ చేపడతామని తెలిపారు. ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా, అనర్హుల పేర్లు తొలగించేలా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, బీఎల్‌వోలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
