వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం: ఎంపీ డా. కడియం కావ్య

ఉమ్మడి వరంగల్ బ్యూరో (ఆంధ్రప్రభ): దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా హనుమకొండ డీసీసీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

అనంతరం జరిగిన సమావేశంలో డా. కడియం కావ్య మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్ పాలన సాగిందన్నారు. రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల అభ్యున్నతి కోసం ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు నేటికీ ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన గొప్ప నాయకుడిగా వైఎస్సార్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవకు అంకితభావంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

అనంతరం రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి డా. కడియం కావ్య పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.