మహానేత వైఎస్సార్‌కు ‘అనంత’ జోహార్లు
అనంతపురంలో ఘనంగా 77వ జయంతి వేడుకలు
సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
వైఎస్సార్ ఆశయాల సాధనకు కట్టుబడి ఉంటామని అనంత వెంకటరామిరెడ్డి వెల్లడి
అనంతపురం ప్రతినిధి, ఆంధ్రప్రభ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి వేడుకలను అనంతపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా వైసీపీ ఇంటెలెక్చువల్ విభాగం నాయకుడు కట్టుబడి తానీషా రచించిన ‘జననేత’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వద్ద అన్నదానం నిర్వహించారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గైనిక్ వార్డులో గర్భిణులు, బాలింతలకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. రూరల్ మండలంలోని తపోవనం సర్కిల్‌లో యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి ఆధ్వర్యంలో రంగస్వామినగర్ స్పందన ఫౌండేషన్‌లో బుద్ధిమాంద్య పిల్లలకు అన్నదానం నిర్వహించారు.
అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి భౌతికంగా లేకపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనంతపురం జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. రాయలసీమకు కృష్ణా జలాలు అందించడం, జలయజ్ఞం ద్వారా అనేక సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం, తాడిపత్రి నార్త్ కెనాల్ స్థిరీకరణ, పెండేకల్లు, చాగల్లు, యాడికి కెనాల్ పనులు చేపట్టడం వైఎస్సార్ కృషి ఫలితమని పేర్కొన్నారు.
అనంతపురం ఆర్ట్స్ కళాశాల హాస్టల్ ఏర్పాటు, జేఎన్‌టీయూకు స్వయంప్రతిపత్తి, మడకశిరలో వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపన, అనంతపురం నగరంతో పాటు ధర్మవరం, కదిరి, రాయదుర్గం, గుంతకల్లుకు తాగునీటి పథకాలు అందించడం వంటి అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్సార్ పాలనలోనే జరిగాయని గుర్తు చేశారు. రాజకీయాలు, కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ ఆశయాల సాధన కోసం పార్టీ ముందుకు సాగుతోందని, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా కృషి కొనసాగిస్తామని అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. పేదల విద్య కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య రక్షణ కోసం ఆరోగ్యశ్రీ వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.
