చంద్రబాబు ఆదేశాలతోనే తెలంగాణకు ద్రోహం – పల్లా రాజేశ్వర్ రెడ్డి
- నీటిపారుదల శాఖపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణలు
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. నీటిపారుదల శాఖకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారి ఆదిత్యనాథ్ దాస్‌ను నియమించడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.
సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని లిఫ్ట్ చేసే వ్యవస్థ అందుబాటులో ఉన్నప్పటికీ, కావాలనే వినియోగించడం లేదని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై అధికార పార్టీ నాయకులు మౌనం వహిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
తమ పదవులు పోతాయనే భయంతో కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం లేదని ఆయన విమర్శించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణ, రైతులపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఎన్డీఎస్ఏ నివేదిక పేరిట గాలి మాటలు చెప్పడం మానేసి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ఎన్డీఎస్ఏ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ రూపొందించిన డిజైన్ల ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని పేర్కొంటూ, పలుమార్లు దెబ్బతిన్నప్పటికీ ఇప్పటివరకు ఎవరి పైనా చర్యలు తీసుకోలేదని అన్నారు. అలాంటప్పుడు పోలవరం విషయంలో ఎన్డీఎస్ఏ నివేదిక ఎందుకు రాలేదని ప్రశ్నించారు. గత రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ నాయకుల ధనదాహంతో ఆనకట్టల వద్ద లక్షల టన్నుల ఇసుకను అక్రమంగా తరలించారని, ప్రస్తుతం కూడా బ్యారేజీల వద్ద ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. నీటిపారుదల శాఖకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారి ఆదిత్యనాథ్ దాస్‌ను నియమించి, నీటిని లిఫ్ట్ చేసే వ్యవస్థ అందుబాటులో ఉన్నప్పటికీ కావాలనే ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలిస్తున్నారని ఆరోపించారు.
