సీఎం రేవంత్‌కు మంత్రి కొండా సురేఖ లేఖ‌

  • కడియం శ్రీహరిపై ఫిర్యాదు!
  • దేవాదాయ శాఖ వ్యవహారాల్లో జోక్యమంటూ ఆగ్రహం..
  • పార్టీ క్రమశిక్షణ కమిటీతో విచారణకు డిమాండ్

ఆంధ్ర‌ప్ర‌భ, హైదరాబాద్ : తెలంగాణ అధికార పక్షంలో అంతర్గత విభేదాలు, పాలనాపరమైన వివాదాలు మ‌రోసారి చెల‌రేగాయి. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవహారశైలిపై దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా తన అధికార పరిధిని, ప్రభుత్వ పరిపాలనా విధానాలను బేఖాతరు చేస్తూ కడియం శ్రీహరి వ్యవహరిస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొండా సురేఖ అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం (జూలై 7న‌) ఆమె ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు.

మంత్రికి తెలీకుండానే దేవాదాయ శాఖ రివ్యూ!

దేవాదాయ, ధర్మాదాయ శాఖకు సంబంధించిన పరిపాలన, విధాన నిర్ణయాలు, అధికారిక సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ అంతా సంబంధిత శాఖా మంత్రి పరిధిలోకి వస్తుందని కొండా సురేఖ స్పష్టం చేశారు. అయినప్పటికీ, శాఖా మంత్రిగా ఉన్న తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే, ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయ శాఖ డైరెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులను సమావేశపరచడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

పలు దేవాలయాల అభివృద్ధి, నిధుల కేటాయింపులు, మాస్టర్ ప్లాన్ల రూపకల్పన, దేవాలయ భూముల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు వంటి కీలక అంశాలపై కడియం శ్రీహరి అధికారులతో సమీక్ష నిర్వహించడమే కాకుండా, వారికి గడువులు కూడా నిర్దేశించడం పరిపాలనా పరంగా తీవ్ర అభ్యంతరకరమని, ఇది ‘రూల్స్ ఆఫ్ బిజినెస్’ (Rules of Business) స్ఫూర్తిని పూర్తిగా ఉల్లంఘించడమేనని మంత్రి లేఖలో పేర్కొన్నారు.

సీనియర్ నేత అయి ఉండి.. అనుచిత సంప్రదాయమా?

శాఖా పరిపాలనకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు సంబంధిత మంత్రి ఆధ్వర్యంలోనే జరగాలనే కనీస విషయం ప్రజా జీవితంలో ఎంతో అనుభవజ్ఞుడైన కడియం శ్రీహరి లాంటి ప్రజాప్రతినిధికి తెలియంది కాదని కొండా సురేఖ ఎద్దేవా చేశారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మంత్రిని పూర్తిగా పక్కనపెట్టి అధికారిక సమీక్ష నిర్వహించడం ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలో అత్యంత అనుచిత సంప్రదాయానికి దారితీస్తుందని హెచ్చరించారు.

పార్టీ క్రమశిక్షణా కమిటీ విచారణకు డిమాండ్

ఇలాంటి చర్యలు ప్రభుత్వంలో పరిపాలనా సమన్వయాన్ని దెబ్బతీయడమే కాకుండా, అధికార యంత్రాంగంలో తీవ్ర అయోమయ పరిస్థితులకు దారితీస్తాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పార్టీ స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా పరిశీలించి, కడియం శ్రీహరి నుంచి వివరణ కోరడంతో పాటు, పార్టీ క్రమశిక్షణా కమిటీ ద్వారా విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ తన ఫిర్యాదులో గట్టిగా డిమాండ్ చేశారు. మరి ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.