మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటనను అడ్డుకుంటాం

మొక్కజొన్న కొనుగోళ్లలో అవినీతిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నేత శ్రీశైలం డిమాండ్

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో బుధవారం (జూలై 8) పర్యటించనున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటనను అడ్డుకుంటామని టీఆర్ఎస్ నాయకుడు, మాజీ జెడ్పీటీసీ చిక్కొండ్ర శ్రీశైలం హెచ్చరించారు.

మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, నాగర్‌కర్నూల్ జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలో భారీ స్థాయిలో అవినీతి జరిగినప్పటికీ, ఇప్పటి వరకు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

గన్నీ బ్యాగులను బ్లాక్ మార్కెట్‌లో విక్రయించి అక్రమంగా లబ్ధి పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని, మార్కెట్ కమిటీ చైర్మన్ అవినీతిని స్థానిక ఎమ్మెల్యే సమర్థించడం సరికాదని విమర్శించారు.

హమాలీ, రవాణా పేర్లతో రైతుల నుంచి అదనంగా వసూలు చేసిన సొమ్మును వెంటనే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్న శ్రీశైలం, మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన సందర్భంగా నిరసన చేపట్టి తమ ఆందోళనను వ్యక్తం చేస్తామని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రామకృష్ణారెడ్డి, మన్యపు రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటయ్య, వంశీ గౌడ్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.