ప్రజలకు మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యం
- రూ.360 కోట్లతో రెవెన్యూ కార్యాలయాలకు శాశ్వత భవనాలు
- తొలిదశలో 10 ఆర్డీవో, 107 తహసీల్దార్, 53 రిజిస్ట్రేషన్ కార్యాలయాల నిర్మాణం
- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో రెవెన్యూ పరిపాలనను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు ఆధునిక సౌకర్యాలతో కూడిన సేవలు అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు దశలవారీగా శాశ్వత భవనాలు నిర్మించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార-పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
మంగళవారం ఈ భవనాల నిర్మాణ పనులపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తొలి దశలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న లేదా శిథిలావస్థకు చేరుకున్న 107 తహసీల్దార్ కార్యాలయాలు, 10 ఆర్డీవో కార్యాలయాల నిర్మాణానికి రూ.263 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
అదే విధంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు చెందిన 48 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో డీఐజీ కార్యాలయాల నిర్మాణానికి రూ.97 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ రెండు విభాగాలకు కలిపి మొత్తం రూ.360 కోట్ల పరిపాలనా అనుమతులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
కొత్తగా నిర్మించే కార్యాలయాలన్నీ ఒకే నమూనాలో, ఆధునిక సౌకర్యాలతో రూపొందించి ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఈ నిర్మాణ బాధ్యతను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించినట్లు వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు.
భవనాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను జిల్లా స్థాయిలో రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని వెంటనే గుర్తించాలని, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని హౌసింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ప్రజలకు సులభంగా చేరుకునేలా నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 13 క్లస్టర్లుగా విభజించి సమీకృత రిజిస్ట్రేషన్ కార్యాలయాల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా ప్రైవేట్ నిర్మాణ సంస్థలతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని, నిర్మాణంతో పాటు ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యతలను కూడా ఆయా సంస్థలే చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో శంకుస్థాపన పూర్తై నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
