సహకార బ్యాంకింగ్‌లో ఉత్తమ విధానాలు…
అధ్యయనానికి అమృత్సర్ పర్యటన
పాల్గొన్న మాజీ మంత్రి, కృష్ణా డీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురామ్
విజయవాడ, ఆంధ్రప్రభ : సహకార బ్యాంకింగ్ రంగంలో ఆధునిక విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న బ్యాంకింగ్ సేవలు మరియు సంస్థాగత సామర్థ్యాన్ని అధ్యయనం చేసే లక్ష్యంతో మాజీ మంత్రి, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురామ్ ఆప్కాబ్ చైర్మన్ శ్రీ గన్ని వీరాంజనేయులు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ డీసీసీ బ్యాంకుల చైర్మన్ల ప్రతినిధి బృందంతో కలిసి పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌ను సందర్శించారు.
ఈ సందర్భంగా అమృత్సర్ డీసీసీ బ్యాంకు యాజమాన్యంతో వ్యాపారాభివృద్ధి, డిపాజిట్ల పెంపు, రుణాల నిర్వహణ, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, వినియోగదారుల-కేంద్రీకృత సేవలు, పాలనా విధానాలు, సాంకేతికత ఆధారిత బ్యాంకింగ్, ఆర్థిక సమ్మిళితం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే అమృత్సర్ డీసీసీ బ్యాంకు అమలు చేస్తున్న ఉత్తమ బ్యాంకింగ్ విధానాలు, పూర్తి స్థాయి వ్యవస్థ, ఆర్ టి జి ఎస్, నెఫ్ట్ సేవలు, ఎటిఎం నెట్వర్క్, సమాచార భద్రతా వ్యవస్థలు, రైతులకు అందిస్తున్న రుణ సేవలు తదితర అంశాలను ప్రతినిధి బృందం పరిశీలించి విలువైన అవగాహన పొందింది.
ఈ అధ్యయన పర్యటన ద్వారా సహకార బ్యాంకుల మధ్య విజ్ఞాన మార్పిడి మరింత బలోపేతమై, సభ్యులకు నాణ్యమైన సేవలు, రైతులకు మెరుగైన ఆర్థిక సహకారం, సాంకేతికత ఆధారిత బ్యాంకింగ్ విస్తరణకు దోహదపడుతుందని నెట్టెం శ్రీ రఘురామ్ తెలిపారు.
