ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతే ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని
టీడీపీ నాయకులు గద్దె క్రాంతి కుమార్
విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌కు ఎప్పటికీ అమరావతే రాజధానిగా ఉంటుందని, ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతిని విచ్ఛిన్నం చేయలేరని టీడీపీ నాయకులు గద్దె క్రాంతి స్పష్టం చేశారు. మంగళవారం గద్దె క్రాంతి కుమార్ 14వ డివిజన్ చిన వంతెన సెంటర్ చైత్ర స్కూల్ ఏరియాలో పర్యటించి స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలువురు డ్రైనేజి సమస్య ఉన్నట్లు తెలిపారు. అనంతరం ముస్లిం మహిళ షేక్ ఫాతిమాకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 20 వేలు ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్బంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ జగన్ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోలో “మావిగన్” పేరుతో అంశాన్ని చేర్చుతామని చెప్పడం చూస్తే, వైసీపీకి ఇప్పటికీ అమరావతిపై ఉన్న వ్యతిరేక వైఖరి ఏమాత్రం మారలేదని విమర్శించారు. ప్రజలను గందరగోళానికి గురిచేయడమే వారి లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. 2014లో అసెంబ్లీ సాక్షిగా అమరావతిని రాజధానిగా అంగీకరిస్తున్నామని చెప్పిన జగన్, 2019 ఎన్నికల సమయంలో తన ఇల్లు కూడా అమరావతిలోనే ఉందని తాను అమరావతికి కట్టుబడి ఉన్నానని చెప్పిన విషయాలు గుర్తు చేశారు.
తదుపరి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చి రాష్ట్రాభివృద్ధిని దెబ్బతీశారని ఆరోపించారు. ఇప్పుడు మరోసారి మావిగన్ పేరుతో కొత్త వాదనను ముందుకు తేవడం ద్వారా రాజధాని అంశంపై వైసీపీకి ఎలాంటి స్థిరమైన విధానం లేదని స్పష్టమవుతోందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎప్పటికప్పుడు మాటలు మార్చడం జగన్‌కు, వైకాపా వారికి అలవాటుగా మారిందని విమర్శించారు. అమరావతి కోసం వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చి రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేశారని, అలాంటి రైతుల ఆకాంక్షలను దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నీ ప్రజలు సహించరని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అమరావతి నిర్మాణం వేగంగా కొనసాగుతోందని, రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు రావడానికి అమరావతే కేంద్రబిందువుగా నిలుస్తుందని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేసే వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని గద్దె క్రాంతి అన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణా రమేష్, నర్రా కిషోర్, గరికిపాటి బద్రి, యడ్లపల్లి నాగరాజు, వీరంకి డాంగే కుమారి, కోటేశ్వరరావు, రేపాకుల ప్రసాద్, రమేష్, సుంకర వెంకన్న, పీ.వి.ఆర్, పానేం వెంకటేశ్వర్లు, దండేంపల్లి ఆంజనేయులు, గవిడి లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు.
