పవన్‌పై కేసు రాజకీయ ప్రేరేపితమే : రేఖా గౌడ్

కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై పార్వతి బాయి దాఖలు చేసిన కేసుపై శ్రీశైలం బోర్డు సభ్యురాలు రేఖా గౌడ్ తీవ్రంగా స్పందించారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గన్నవరం ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ముందుగా స్పందించింది పవన్ కళ్యాణేనని, ఆయన జోక్యం చేసుకున్న అనంతరమే ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం, మద్దతు అందిందని రేఖా గౌడ్ పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ అధ్యక్షుడిపై విమర్శలు చేయడం, కేసులు నమోదు చేయడం బాధాకరమని అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో బాధిత కుటుంబం తరఫున పోరాటం చేసిన వారెవరో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని ఆమె సూచించారు. రాజకీయ నాయకుల ప్రలోభాలకు లోనై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం, కేసులను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించడం సమంజసం కాదని విమర్శించారు. ఈ వ్యవహారంలో ఎవరికి అయినా అన్యాయం జరిగి ఉంటే ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని జనసేన పార్టీ కూడా కోరుతుందని రేఖా గౌడ్ స్పష్టం చేశారు. అయితే ఈ కేసును అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం జనసేన పార్టీ ఎప్పుడూ చేయదని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు బాధిత కుటుంబానికి అండగా నిలిచింది జనసేన పార్టీయేనని ఆమె అన్నారు. సంబంధం లేని అంశాలను ఈ కేసుతో ముడిపెట్టి రాజకీయ విమర్శలు చేయకుండా, ఇతర పార్టీల ప్రలోభాలకు లోనుకాకుండా ఉండాలని పార్వతి బాయికి హితవు పలికారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు కరుణాకర్, రామ్మోహన్, మహబూబ్ బాషా, జీవన్, సుధాకర్, మాలిక్‌తో పాటు వీర మహిళలు సుజాత, పుష్ప తదితరులు పాల్గొన్నారు.