Nude-Calls-Prostitution : న్యూడ్ కాల్స్ దందా Andhra Prabha Crime Story

Nude-Calls-Prostitution : న్యూడ్ కాల్స్ దందా Andhra Prabha Crime Story

  • భార్యతోనే వ్యభిచారం,
  • రహస్య చిత్రీకరణ
  • భర్తే సూత్రధారి ?
  • బాధితురాలి కన్నీటి కథ
  • కుప్పంలో కలకలం

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో

Nude-Calls-Prostitution : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో న్యూడ్ కాల్స్, వ్యభిచార దందా వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. బాధితురాలి గోడు సోషల్​ మీడియాలో వైరల్​ అవెతోంది ఈ వ్యవహారం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. పదేళ్లుగా తనను భర్తే వ్యభిచారంలోకి నెట్టాడని, ఆ దందా ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని అతడికే అప్పగించానని, తనకు తెలియకుండా గదుల్లో రహస్యంగా చిత్రీకరణ కూడా జరిగి ఉండొచ్చని ఆమె చేసిన ఆరోపణలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ సాగుతుండగా, పోలీసులు కూడా ప్రాథమిక విచారణకు సిద్ధమవుతున్నారు.

బాధితురాలి కథనం ప్రకారం, పెళ్లి తర్వాత తన భర్త మాయమాటలతో తన జీవితాన్ని పూర్తిగా మార్చేశాడని తెలిపింది. కొన్ని సంవత్సరాలు కష్టపడదాం… ఇల్లు కట్టుకుని హాయిగా జీవిద్దాం… ఈ విషయం ఎవరికీ తెలియనివ్వను… నా ప్రాణం ఉన్నంతవరకు నిన్ను కాపాడుతాను అంటూ నమ్మించి వ్యభిచారంలోకి దింపాడని ఆరోపించింది. మొదట్లో భర్తపై నమ్మకంతో తాను ఆ దారిలో నడిచానని, పదేళ్లుగా ఆ దందా ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని అతడికే అప్పగించానని తెలిపింది. తన పేరుతో ఒక్క రూపాయి కూడా దాచుకోలేదని, కుటుంబం కోసమే అంతా చేశానని ఆవేదన వ్యక్తం చేసింది.

వ్యభిచారం ద్వారా వచ్చిన ఆదాయంతో ఇల్లు కట్టుకుందామని, భవిష్యత్తు బాగుంటుందని భర్త ఎప్పటికప్పుడు నమ్మించేవాడని ఆమె పేర్కొంది. తన జీవితాన్ని, గౌరవాన్ని తాకట్టు పెట్టి సంపాదించిన డబ్బంతా భర్త చేతికే వెళ్లిందని, చివరకు తానే మోసపోయానని వాపోయింది.

కాలక్రమేణా భర్త ప్రవర్తనలో తీవ్ర మార్పు వచ్చిందని బాధితురాలు తెలిపింది. తాను ఎవరితోనైనా వెళ్లిపోతానేమోననే అనుమానంతో తనపై నిరంతరం నిఘా పెట్టాడని ఆరోపించింది. తాను ఉండే గదుల్లో తనకు తెలియకుండా రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి, అక్కడికి వచ్చే వ్యక్తులతో ఉన్న దృశ్యాలను చిత్రీకరించేవాడని అనుమానం వ్యక్తం చేసింది. ఈ వీడియోలను ఎలాంటి ఉద్దేశంతో తీసేవాడో తనకు తెలియదని, కానీ తన ప్రమేయం లేకుండానే ఈ వ్యవహారం సాగిందని పేర్కొంది.

ఇటీవల జరిగిన ఘటనతో అసలు విషయం బయటపడినట్లు బాధితురాలు తెలిపింది. ఎప్పటిలాగే కొందరు వ్యక్తులు గదికి వచ్చిన సమయంలో తనపై జరుగుతున్న నిఘా గురించి తెలుసుకుని తీవ్ర ఆవేదనకు గురయ్యానని చెప్పింది. ఆగ్రహంతో అక్కడికి వచ్చిన వారిని నిలదీశానని, వారిపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో కొందరు అక్కడి నుంచి భయంతో పారిపోయారని వెల్లడించింది. ఆ ఘటన తర్వాత ఈ వ్యవహారం బయటకు రావడం ప్రారంభమైందని పేర్కొంది.

తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టాలనే ఉద్దేశంతో ఓ వార్తా ఛానల్‌ను ఆశ్రయించానని బాధితురాలు తెలిపింది. అక్కడ తన అనుభవాలన్నింటినీ వివరించడంతో ఈ వ్యవహారం ప్రజల దృష్టికి వచ్చిందని చెప్పింది. తనలాంటి పరిస్థితి మరే మహిళకు రాకూడదనే ఉద్దేశంతోనే ముందుకు వచ్చానని పేర్కొంది.

ఈ వ్యవహారంపై కుప్పం డీఎస్పీ పార్థసారథిని సంప్రదించగా, ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని తెలిపారు. అయితే సామాజిక మాధ్యమాలు, వార్తా కథనాల్లో వచ్చిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రాథమిక విచారణ చేపడతామని చెప్పారు. బాధితురాలు ఫిర్యాదు చేస్తే చట్టప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని స్పష్టం చేశారు.

ఈ కేసులో మహిళను బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టడం, ఆర్థికంగా దోపిడీ చేయడం, రహస్య చిత్రీకరణ, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడం, మహిళను మానసికంగా వేధించడం వంటి పలు తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితురాలి వాంగ్మూలంలో పేర్కొన్న అంశాలు నిజమైతే, ఇది కేవలం వ్యభిచార కేసు మాత్రమే కాకుండా మహిళపై దీర్ఘకాలంగా సాగిన దోపిడీ, మానసిక హింస, సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేసిన నేరంగా కూడా పరిగణించే అవకాశం ఉందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అయితే ప్రస్తుతం వెలుగులోకి వచ్చినవి బాధితురాలి ఆరోపణలు మాత్రమే. ఈ ఆరోపణలపై భర్త స్పందన ఇంకా బయటకు రాలేదు. అలాగే పోలీసులు కూడా అధికారికంగా కేసు నమోదు చేయలేదు. దర్యాప్తు అనంతరం మాత్రమే ఆరోపణల్లో ఎంత మేర వాస్తవం ఉందో, రహస్య చిత్రీకరణ నిజంగా జరిగిందా, న్యూడ్ కాల్స్ దందా వెనుక మరెవరైనా ఉన్నారా, మరే ఇతర మహిళలు కూడా ఈ ముఠా బారిన పడ్డారా వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కుప్పం నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీఆంశంగా మారింది..