విద్యుత్ ఘాతంతో పాడి గేదె మృతి
గుమ్మడిదల/జిన్నారం (ఆంధ్రప్రభ): గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం వార్డులో విద్యుత్ ఘాతానికి గురై ఓ పాడి గేదె మృతి చెందింది. స్థానిక రైతు పెరుగు నవీన్ యాదవ్కు చెందిన గేదె మేతకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది.
పాడి గేదె తమ కుటుంబానికి ప్రధాన జీవనాధారమని, దాని మృతితో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని రైతు నవీన్ యాదవ్ తెలిపారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
స్థానిక వైస్ ఛైర్మన్ మహేందర్ గౌడ్ మాట్లాడుతూ, ప్రమాదాలకు కారణమవుతున్న విద్యుత్ లైన్లను వెంటనే మరమ్మతులు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.
